INDIA: విపక్షాల కూటమి.. ‘పీఎం’ అభ్యర్థిగా ‘కేజ్రీవాల్‌’ ఉండాలి! ఆప్‌

విపక్షాల కూటమి ‘ఇండియా’కి సారథ్యం వహించడంతోపాటు ప్రధానమంత్రి అభ్యర్థిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఉండాలని కోరుకుంటున్నామని ఆమ్‌ఆద్మీ పార్టీ పేర్కొంది.

Published : 30 Aug 2023 15:23 IST

దిల్లీ: జాతీయ స్థాయిలో భాజపాను ఎదుర్కొనేందుకు ఏర్పడిన ‘ఇండియా’ (INDIA) కూటమి మరోసారి భేటీ అయ్యేందుకు సిద్ధమైన సమయంలో.. అందులో భాగస్వామ్య పార్టీగా ఉన్న ఆమ్‌ఆద్మీ (AAP) కీలక వ్యాఖ్యలు చేసింది. దిల్లీ ముఖ్యమంత్రిగా.. దేశం మొత్తానికి ఓ మోడల్‌ను అందించిన కేజ్రీవాల్‌ (Arvind Kejriwal).. కూటమికి సారథ్యం వహించడంతోపాటు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొంది. ముంబయిలో మరికొన్ని గంటల్లో కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించనున్న సమయంలో ఆప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి (Prime Minister) అభ్యర్థిగా ఎవరు ఉండనున్నారని ‘పీటీఐ’ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్‌ స్పందిస్తూ.. కూటమి జాతీయ కన్వీనర్‌గా కేజ్రీవాల్‌ పేరును ప్రతిపాదిస్తానని అన్నారు. ఇప్పటివరకు లాభదాయక, ప్రజామోద బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్న ఆమె.. ప్రజలకు లబ్ధిచేకూర్చే మోడల్‌ను అందించారన్నారు. దిల్లీలో ద్రవ్యోల్బణం కనిష్ఠంగా ఉన్న విషయాన్ని కక్కర్‌ గుర్తుచేశారు. పీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్‌ ఉండాలని కోరుకుంటున్నప్పటికీ.. ఆ నిర్ణయం మాత్రం తన చేతుల్లో లేదన్నారు.

చైనా మ్యాప్‌ వివాదం.. మోదీ చెప్పేవి అబద్ధాలని ఏళ్లుగా చెప్తున్నా: రాహుల్‌ ధ్వజం

ఇదే విషయంపై ఆప్‌ దిల్లీ కన్వీనర్‌ గోపాల్‌రాయ్‌ మాట్లాడుతూ.. ప్రతిపార్టీ కూడా తమ నేతనే ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలో ఆప్‌ కూడా తమ జాతీయ కన్వీనర్‌ (కేజ్రీవాల్‌)ను పీఎం కావాలని కోరుకుంటోందన్నారు. ఏదేమైనా.. ఈ విషయంపై కూటమిలోని అన్ని పార్టీలు ఓ నిర్ణయం తీసుకుంటాయని, దానికి అనుగుణంగా ముందుకెళ్తామన్నారు.

భవిష్యత్తు ప్రణాళిక, కూటమి లోగో.. వంటి విషయాలపై కీలకంగా చర్చించేందుకు విపక్ష కూటమి ‘ఇండియా’ సిద్ధమైంది. ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1న ముంబయిలో జరగనున్న ఈ భేటీకి కొత్తగా మరికొన్ని పార్టీలు హాజరవుతాయని కూటమి వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ఇండియా’ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిని ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని చెబుతున్న తరుణంలో ఆప్‌ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని