Anand Mahindra: రియల్‌ ‘12th Fail’ జంటతో ఆనంద్‌ మహీంద్రా లంచ్‌

12th Fail: బాలీవుడ్‌ చిత్రం ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’కు స్ఫూర్తి అయిన ఐపీఎస్‌ అధికారి మనోజ్‌కుమార్‌ శర్మ దంపతులను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా కలిశారు. వారి నుంచి ఆటోగ్రాఫ్‌ తీసుకున్నారు.

Published : 07 Feb 2024 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ట్వెల్త్‌ ఫెయిల్‌ (12th Fail)’.. చిన్న సినిమాగా విడుదలై రికార్డులు సృష్టించింది. కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు స్ఫూర్తి అయిన రియల్‌ ‘ట్వెల్త్ ఫెయిల్‌’ జంటను మహీంద్రా కలిశారు. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ శర్మ, ఆయన సతీమణి, ఐఆర్‌ఎస్‌ అధికారిణి శ్రద్ధా జోషీతో కలిసి లంచ్‌ చేశారు. ఈవిషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ వారితో దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

‘‘నేను ఆటోగ్రాఫ్‌ అడిగినప్పుడు వీళ్లు కాస్త మొహమాట పడ్డారు. కానీ, నేను మాత్రం చాలా గర్వపడుతున్నా. మనోజ్‌శర్మ దంపతులు రియల్‌ లైఫ్‌ హీరోలు. వీరి జీవితాలను ఆధారంగా చేసుకునే ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ తీశారు. చిత్తశుద్ధితో కూడిన జీవితాన్ని గడపాలనే తమ ఫిలాసఫీని ఈ జంట ఇప్పటికీ ఫాలో అవుతోంది. ఈ విధానాన్ని ఎక్కువమంది అవలంబిస్తే భారత్‌ మరింత వేగంగా ప్రపంచశక్తిగా మారుతుంది. ఈ దేశానికి వీళ్లే నిజమైన సెలబ్రిటీలు. వీరి ఆటోగ్రాఫ్‌ నాకు వారసత్వ సంపద. వీరిని కలిసినందుకు నేను ఎంతో గొప్పవాడిగా భావిస్తున్నా’’ అని మహీంద్రా రాసుకొచ్చారు.

‘యే దిల్‌ మాంగే మోర్‌’.. ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’పై ఆనంద్‌ మహీంద్రా రివ్యూ

ముంబయి మహానగర అడిషనల్‌ కమిషనర్‌ మనోజ్‌ శర్మ జీవితమే ఈ ‘ట్వెల్త్‌ ఫెయిల్’ కథ. ఆయన జీవిత కథను మనోజ్‌ మాజీ రూమ్‌మేట్‌ పాండే ఉరఫ్‌ అనురాగ్‌ పాథక్‌ ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ అనే పుస్తకంగా రాశాడు. దాన్నే ప్రముఖ హిందీ దర్శకుడు విధూ వినోద్‌ చోప్రా సినిమాగా తెరకెక్కించి సూపర్‌హిట్‌ అందుకున్నారు. ఈ సినిమాపై ఇటీవల ఆనంద్‌ మహీంద్రా రివ్యూ ఇచ్చారు. ‘ఈ ఏడాది మీరు కేవలం ఒకే ఒక్క సినిమా చూడాలనుకుంటే.. కచ్చితంగా దీన్ని వీక్షించండ’ని నెటిజన్లకు సలహా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని