12th FAIL: ‘యే దిల్‌ మాంగే మోర్‌’.. ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’పై ఆనంద్‌ మహీంద్రా రివ్యూ

విక్రాంత్‌ (Vikrant Massey) హీరోగా నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ (12Th Fail)పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా రివ్యూ ఇచ్చారు.

Updated : 18 Jan 2024 11:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటూ ఆసక్తికర కథనాలు, స్ఫూర్తిదాయక అంశాలను పంచుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) తాజాగా ఓ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అదే ‘ట్వెల్త్‌ ఫెయిల్‌ (12Th Fail)’. విధు వినోద్‌ చోప్రా (Vidhu Vinod Chopra) దర్శకత్వంలో విక్రాంత్‌ మస్సే (Vikrant Massey) నటించిన ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల దీనిని వీక్షించిన మహీంద్రా.. రివ్యూ ఇచ్చారు. ఈ ఏడాది మీరు కేవలం ఒకే ఒక్క సినిమా చూడాలనుకుంటే.. కచ్చితంగా 12th FAIL వీక్షించండని నెటిజన్లకు సలహా ఇచ్చారు.

ఈ సినిమాపై ఆనంద్‌ మహీంద్రా రివ్యూ ఇలా..

  • కథ: నిజ జీవిత హీరోల కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. కేవలం కథానాయకుడే కాదు.. ఈ దేశంలో విజయం కోసం ఆకలితో ఉన్న లక్షలాది మంది యువత అసాధారణ పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడుతోంది. జీవితంలో ఎదురవుతున్న కఠిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు శ్రమిస్తోంది.
  • నటన: ఈ సినిమాలో నటీనటులను ఎంచుకోవడంలో విధు వినోద్‌ చోప్రా అద్భుతంగా పనిచేశారు. ఇందులోని ప్రతి పాత్ర ఉద్వేగభరిత ప్రదర్శన చేసింది. కానీ, విక్రాంత్‌ మస్సే అత్యద్భుత నటన.. నేషనల్‌ అవార్డ్‌కు అర్హత సాధించింది. అతడు ఆ పాత్రలో జీవించాడు.
  • కథనం: గొప్ప సినిమా అనేది మంచి కథ నుంచే వస్తుందనే విషయాన్ని విధు వినోద్‌ చోప్రా స్పష్టంగా చెప్పారు. ఈ సినిమాలో ఇంటర్వ్యూ సీన్‌ హైలైట్‌. అందులో కొంచెం కల్పితమే అయినప్పటికీ.. ఆ సంభాషణలు మనసుల్ని హత్తుకుంటాయి. నవభారత్‌ నిర్మాణానికి మనం ఏం చేయాలో ఈ సినిమా చాటిచెబుతుంది అని మహీంద్రా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘యే దిల్‌ మాంగే మోర్‌’ అంటూ ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని ఆకాంక్షించారు. మహీంద్రా పోస్ట్‌కు నటుడు విక్రాంత్‌ మస్సే ధన్యవాదాలు తెలిపారు. ‘‘మీరు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. మీలాంటి వ్యక్తి నుంచి ప్రశంసలు అందుకోవడంతో ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

హాలీవుడ్‌ చిత్రాలను వెనక్కి నెట్టి ‘12th ఫెయిల్‌’ రికార్డు..

‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ సినిమా విషయానికొస్తే.. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ శర్మ జీవిత కథ ఆధారంగా రూపొందింది. 12వ తరగతి ఫెయిల్‌ అయిన యువకుడు.. ఐపీఎస్‌ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు పోటీపడనుంది. జనరల్‌ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా  చిత్రబృందం నామినేషన్‌ వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని