Bihar: ‘తాగేసి వచ్చారా?’.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలపై సీఎం ఫైర్‌..!

కల్తీ మద్యం సేవించి బిహార్‌ (Bihar) 17 మంది మృతిచెందారు. ఈ ఘటన అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భాజపా ఎమ్మెల్యేలు నిరసన చేపట్టగా.. సీఎం నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) తీవ్ర ఆగ్రహనికి లోనయ్యారు.

Published : 14 Dec 2022 16:15 IST

పట్నా: బిహార్‌ (Bihar)లో మద్యం (Liquor)పై సంపూర్ణ నిషేధం ఉండగా.. కల్తీ మద్యం తాగి ప్రజలు మృత్యువాత పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఛాప్రా జిల్లాలో కల్తీ మద్యం కారణంగా 17 మంది ప్రాణాలు (Hooch Tragedy) Deaths) కోల్పోయారు. దీంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. రాష్ట్ర అసెంబ్లీలో ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) ‘తాగేసి వచ్చారా?’ అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు.

బిహార్‌లో మద్యం వినియోగం, విక్రయాలపై 2016 ఏప్రిల్‌లోనే పూర్తిగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా ఛాప్రాలోని రెండు గ్రామాల్లో ఈ కల్తీ మద్యం కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. మరికొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై బిహార్‌ అసెంబ్లీలో నేడు ప్రతిపక్ష భాజపా (BJP) ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన సీఎం నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) విపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘‘ఏం జరుగుతోంది? అరవకండి. మద్యం సేవించి సభకు వచ్చారా? మీరు చేస్తున్నది కరెక్ట్‌ కాదు. దీన్ని ఎంతమాత్రం సహించేది లేదు’’ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసహనానికి గురైన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

కాగా.. నీతీశ్ వ్యాఖ్యలు రాష్ట్రంలో కొత్త వివాదానికి తెరలేపాయి. దీనిపై కేంద్రమంత్రి, భాజపా నేత గిరిరాజ్‌ సింగ్‌ (Giriraj Singh) మాట్లాడుతూ.. ‘‘10 ఏళ్ల క్రితం నీతీశ్‌జీ ఇలా చేయలేదు. ఇప్పుడు ఆయనకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడంతో పాటు వయసు కూడా పెరుగుతోంది. అందుకే కోపం తెచ్చుకుంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. అంతేగాక, ‘‘బిహార్‌లో మద్యం రాష్ట్రమంతటా ఉంటుంది. కానీ ఎవరూ దాన్ని చూడలేరు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆయన పనైపోయింది..: సుశీల్‌ మోదీ

నీతీశ్‌ వ్యాఖ్యలపై భాజపా (BJP) ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ‘‘నీతీశ్‌ కాలం ముగిసింది. ఆయన తన జ్ఞాపకశక్తిని కోల్పోయినట్లున్నారు. ఈ మధ్య తరచూ కోపం తెచ్చుకుంటున్నారు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని