Ashwini Choubey: మీడియా ఎదుటే కన్నీటి పర్యంతమైన కేంద్రమంత్రి

గుండెపోటుతో మృతి చెందిన తన సహచర నేతను తలచుకొని కేంద్రమంత్రి అశ్వినీ చౌబే(Ashwini Choubey) కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన అకాల మరణాన్ని మంత్రి తట్టుకోలేకపోయారు. 

Updated : 17 Jan 2023 15:13 IST

పట్నా: సహచర నేత మృతిపై కేంద్రమంత్రి అశ్వినీ చౌబే(Ashwini Choubey) తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. మీడియా ముందే ఏడ్చేశారు. పక్కనున్నవారు ఓదార్చినప్పటికీ.. తనను తాను నియంత్రించుకోలేకపోయారు.

భారతీయ జనతాపార్టీ కిసాన్‌ మోర్చా నేషనల్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పరుశురామ్ చతుర్వేది(Parshuram Chaturvedi).. బిహార్‌(BIhar)లోని బక్సర్‌(Buxar)లో సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ వార్త విన్న కేంద్రమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘వణికించే చలిలో గత మూడు రోజులుగా రైతు సమస్యలపై జరుపుతోన్న నిరాహారదీక్షలో నాతో పాటు పరుశురామ్ పాల్గొన్నారు. ఆయన అకాల మరణం గురించి ఇప్పుడే తెలిసింది’ అంటూ మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం గత 24 గంటల వ్యవధిలో బక్సర్‌లో తనపై రెండుసార్లు దాడికి యత్నాలు జరిగాయని ఆరోపించారు.

‘రైతు సమస్యలపై బక్సర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో దుండగులు నాపై దాడికి యత్నించారు. కర్రలు ఊపుతూ మీదికి వచ్చారు. కానీ వెంటనే స్పందించిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది వారిని అడ్డుకోపోతే.. నా పరిస్థితి ఎలా ఉండేదో..? అంతకు ముందు ఇలాంటి యత్నమే జరిగింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు నేను ఫిర్యాదు చేశాను. కానీ వారి నుంచి సరైన స్పందన రాలేదు. అలాగే అదుపులోకి తీసుకున్న ముగ్గురిని కూడా వదిలేశారు’ అంటూ నీతీశ్‌ కుమార్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని