Bomb Blast: జమ్ము విమానాశ్రయంలో పేలుళ్లు

జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించినట్లు భారత వైమానిక దళ(ఐఏఎఫ్‌) అధికారులు తెలిపారు. ఆదివారం వేకువజామున రెండు గంటల సమయంలో పేలుళ్ల ధాటికి విమానాశ్రయంలోని ఓ భవనం పైకప్పు.....

Updated : 27 Jun 2021 19:29 IST

జమ్ము: జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించినట్లు భారత వైమానిక దళ(ఐఏఎఫ్‌) అధికారులు తెలిపారు. ఆదివారం వేకువజామున రెండు గంటల సమయంలో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి విమానాశ్రయంలోని ఓ భవనం పైకప్పు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. విషయం తెలుసుకున్న బాంబు స్క్యాడ్‌, ఫోరెన్సిక్‌ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని తనిఖీలు ప్రారంభించాయి. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. జమ్ము విమానాశ్రయ రన్‌వే, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థ ఐఏఎఫ్‌ నియంత్రణలో ఉంటాయి.

స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు విమానాశ్రయం వెలుపల ముమ్మర గాలింపు చేపట్టాయి. అలాగే ఉగ్రవాదుల దుశ్చర్య కూడా అయి ఉండొచ్చనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్‌ఐఏ, ఎన్ఎస్‌జీ బలగాలు సైతం అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరా తీశారు. వైస్‌ ఎయిర్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ హెచ్‌ఎస్‌ అరోరాతో మాట్లాడారు. మరో ఉన్నతాధికారి ఎయిర్‌ మార్షల్‌ విక్రమ్ సింగ్‌ నేడు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నారు.

డ్రోన్ల వినియోగం?

ఈ పేలుళ్లలో డ్రోన్లను వినియోగించినట్లు తెలుస్తోంది. డ్రోన్లకు జీపీఎస్‌ను అమర్చి లక్ష్యాన్ని సెట్‌ చేసి మరీ ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు సమాచారం. డ్రోన్ల వినియోగం నేపథ్యంలో దీని వెనుక దాయాది పాక్‌ హస్తం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. 2016లో పఠాన్‌కోట్‌ దాడి తరహాలోనే భారీ కుట్రకు వ్యూహారచన చేసినట్లు అనుమానిస్తున్నారు. సరిహద్దుల మీదుగా వచ్చిన డ్రోన్ల ద్వారానే ఈ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. యుద్ధ సమయంలో తప్ప మిగతా సమయాల్లో ఇతర దేశాల్లోని యుద్ధ స్థావరాలపై దాడి చేయడం చాలా తీవ్రమైన అంశమని అధికారులు తెలిపారు. దీంతో పేలుళ్ల తీవ్రత, పరిస్థితిని సమీక్షించేందుకు ఇప్పటికే అధికారులు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.

మరోవైపు 4.7కిలోల ఎల్‌ఈడీ కలిగిన ఇద్దరు అనుమానితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు లష్కరే తోయిబా ఉగ్రవాదిగా భావిస్తున్నారు. అయితే, దీనికీ.. జమ్ము పేలుళ్లకు మధ్య ఎలాంటి సంబంధం లేదని అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల ఆరంభంలో శ్రీనగర్‌లో పోలీసులు 10 కిలోల ఎల్‌ఈడీని స్వాధీనం చేసుకున్నారు. చన్‌పోరాలోని ప్రభుత్వ భవన సముదాయం వద్ద స్టీల్‌ కంటైనర్‌లో అమర్చిన దాన్ని భద్రతా బలగాలు ముందుగానే గుర్తించి నిర్వీర్యం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని