Anil Deshmukh: అనిల్‌ దేశ్‌ముఖ్‌కు బెయిల్‌.. అంతలోనే..!

అవినీతి కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ (Anil Deshmukh)కు బెయిల్‌ లభించినప్పటికీ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. బెయిల్‌ మంజూరైన క్షణాల్లోనే ఆ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.

Published : 12 Dec 2022 14:20 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) మాజీ హోంమంత్రి, ఎన్సీపీ (NCP) నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌ (Anil Deshmukh)కు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే క్షణాల్లో ఆ బెయిల్‌పై ఉన్నత న్యాయస్థానం స్టే విధించడం గమనార్హం. బెయిల్‌ మంజూరుపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, అందుకు కొంత సమయం ఇవ్వాలని సీబీఐ.. హైకోర్టును కోరింది. దీంతో దేశ్‌ముఖ్‌ బెయిల్‌ను హోల్డ్‌లో పెడుతున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.

మనీలాండరింగ్‌ కేసులో అనిల్ దేశ్‌ముఖ్‌ (Anil Deshmukh)ను గతేడాది నవంబరులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జైల్లో ఉన్నారు. ఆ తర్వాత అవినీతి కేసులో సీబీఐ ఆయనను కస్టడీలోకి తీసుకుంది. ఈడీ కేసులో గత నెల ఆయనకు బెయిల్‌ మంజూరైనప్పటికీ.. సీబీఐ (CBI) కస్టడీ కారణంగా జైలు నుంచి బయటకు రాలేదు. దీంతో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చడంతో హైకోర్టును ఆశ్రయించారు. దేశ్‌ముఖ్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే సీబీఐ అభ్యర్థనతో ఆ ఉత్తర్వులపై స్టే విధించింది.

దేశ్‌ముఖ్‌ మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు.. ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసులకు లక్ష్యం పెట్టినట్లు అప్పటి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పరమ్‌బీర్‌ సింగ్‌ గతేడాది మార్చిలో ఆరోపించారు. దీంతో ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు చేపట్టి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఆయనపై ఈడీ మనీలాండరింగ్‌ కేసు కూడా పెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని