
Covid vaccine: పాజిటివ్ వస్తే.. మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్ డోస్
దిల్లీ: కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనా మహమ్మారి బారిన పడిన వారికి మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్ వేయాలంది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి వికాశ్ షీల్ లేఖలు రాశారు. కొవిడ్ బారిన పడిన వారికి సాధారణ డోసులు సహా ప్రికాషన్ డోసు వేసే విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలంటూ వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో ఈ సూచనలు చేస్తున్నట్లు తెలిపారు.
ఎవరైనా కొవిడ్ కారణంగా అనారోగ్యం పాలైతే కోలుకున్న నాటి నుంచి మూడు నెలల తర్వాతే వ్యాక్సిన్ డోసు వేయాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదే విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించింది. టీకా కార్యక్రమానికి సంబంధించి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇచ్చిన సూచనల మేరకు ఈ మార్గదర్శకాలు వెలువరిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తన లేఖలో పేర్కొంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాధారణ వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు 15-18 ఏళ్ల వయసు వారికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. మరోవైపు ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు అందిస్తున్నారు. ఓ వైపు మూడో వేవ్ కారణంగా కరోనా కేసులు దేశంలో మళ్లీ పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం మళ్లీ కొవిడ్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునే విషయంలో కేంద్రం తాజా మార్గదర్శకాలు ఇచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.