Satyapal Malik: సత్యపాల్‌ మాలిక్‌ ఇంటికి సీబీఐ.. 5 గంటలపాటు విచారణ..!

జమ్మూ- కశ్మీర్‌లో ఓ బీమా పథకం అవినీతి కేసులో మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను శుక్రవారం సీబీఐ విచారించింది. ఈ కేసులో మాలిక్‌ను సీబీఐ విచారించడం ఏడు నెలల వ్యవధిలో ఇది రెండోసారి.

Published : 28 Apr 2023 23:57 IST

దిల్లీ: జమ్మూ- కశ్మీర్‌ (Jammu Kashmir) మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ (Satyapal Malik)ను సీబీఐ (CBI) విచారించింది. ఓ బీమా పథకం ఒప్పందంలో అవినీతి (Insurance Scam) చోటుచేసుకుందని జమ్మూ- కశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో ఆయన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ కేసుకు సంబంధించి వివరణ కోసం ఏప్రిల్ 28న విచారణ చేపడతామంటూ సీబీఐ ఇటీవల ఆయనకు నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలోనే సీబీఐ బృందం శుక్రవారం ఉదయం 11.45 గంటల సమయంలో దిల్లీలోని మాలిక్‌ నివాసానికి చేరుకుంది. ఈ కేసులో సాక్షిగా దాదాపు 5 గంటలపాటు ఆయన్ను విచారించి, స్టేట్‌మెంట్‌ రికార్డు చేసినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఆయన ఈ కేసులో నిందితుడు, అనుమానితుడు కాదని సీబీఐ తెలిపింది. ఈ కేసులో మాలిక్‌ను సీబీఐ విచారించడం ఏడు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. గత ఏడాది అక్టోబర్‌లో ఒకసారి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. పుల్వామా దాడి ఘటనపై మాలిక్‌ ఇటీవల కేంద్రంపై సంచలన ఆరోపణలు చేసిన క్రమంలో ఈ విచారణ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సత్యపాల్‌ మాలిక్‌ 2018లో జమ్మూ- కశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల కోసం ఉద్దేశించిన వైద్య బీమా పథకంతోపాటు కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో సివిల్ వర్క్ కాంట్రాక్టుల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ ఫైళ్లను క్లియర్‌ చేసేందుకు రూ.300 కోట్ల లంచం ఇవ్వజూపారని పేర్కొన్నారు. వీటిపై గతేడాది ఏప్రిల్‌లో సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలోనే బీమా పథకం కేసులో తాజాగా ఆయన్ను మరోసారి ప్రశ్నించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని