Rajanath singh: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కరోనా పాజిటివ్‌

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh)కు కొవిడ్‌ (Covid 19) పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆయన హోం క్వారంటైన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

Updated : 20 Apr 2023 17:38 IST

దిల్లీ: దేశంలో కరోనా (Coronavirus) కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) కరోనా బారిన పడ్డారు.  గురువారం ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం భారత వాయుసేన కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి ఉంది.కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారు. 

రాజ్‌నాథ్‌ సింగ్ బుధవారం చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండేతో  కలిసి ఆర్మీ కమాండర్స్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. నిన్న జరిగిన కేబినెట్‌ భేటీలో ఆయన పాల్గొన్నారా? లేదా? అనేది తెలియాల్సివుంది. మరోవైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,591 కోవిడ్ కేసులు నమోదు కాగా,  వైరస్ బారిన పడి 40 మంది మృతి చెందారు. బుధవారం నమోదైన కేసులతో పోల్చితే 20 శాతం పాజిటివ్ కేసులు పెరిగాయి. కేంద్ర వైద్యారోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం 65,286 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ, హరియాణ, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.  దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 5.46 శాతంగా ఉంది. ఈ కేసుల్లో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ XBB.1.16 బాధితులే ఎక్కువగా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని