Rahul Gandhi: రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి.. ఎందుకంటే?

లద్ధాఖ్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన రహదారులను ప్రమోట్ చేస్తున్నందుకు కాంగ్రెస్‌ (Congress) పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) ధన్యవాదాలు తెలిపారు.

Updated : 20 Aug 2023 12:43 IST

దిల్లీ/లద్ధాఖ్‌: కాంగ్రెస్‌ (Congress) పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ (Ladakh)లోని లేహ్‌ (Leh) పర్యటనలో భాగంగా శనివారం పాంగాంగ్‌ సరస్సుకు బైక్‌ రైడ్‌ చేపట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. అయితే, రాహుల్‌ బైక్‌ యాత్రపై కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు (Kiren Rijiju) స్పందించారు. లద్ధాఖ్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన రహదారులను ప్రమోట్‌ చేస్తున్నందుకు రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కిరణ్‌ రిజిజు ఓ వీడియోను ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేశారు. 2012లో లద్ధాఖ్‌లో రోడ్లు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడి రహదారుల పరిస్థితి ఎలా ఉందనేది తెలిపేలా వీడియోను రూపొందించారు.

‘‘ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లద్ధాఖ్‌లో నిర్మించిన రహదారులను ప్రమోట్ చేస్తుందన్నందుకు రాహుల్‌ గాంధీకి ధన్యవాదాలు. కొద్ది రోజుల క్రితం కశ్మీర్‌ వ్యాలీలో పర్యాటకం ఎలా అభివృద్ధి చెందుతుందో ఆయన చూపించారు (రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రను శ్రీనగర్‌లో ముగించిన సంగతిని గుర్తు చేస్తూ). ప్రస్తుతం మన జాతీయ జెండా శ్రీనగర్‌లోని లాల్‌ చౌక్‌లో శాంతియుతంగా రెపరెపలాడుతోంది’’ అని రిజిజు ట్వీట్‌లో పేర్కొన్నారు. 

పాంగాంగ్‌ సరస్సు వద్ద రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించిన రాహుల్‌ గాంధీ

రాహుల్‌ గాంధీ ఈ నెల 25 వరకు లద్ధాఖ్‌లో పర్యటించనున్నారు. అంతకు ముందు తన బైక్‌ పర్యటన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన రాహుల్‌ ‘‘ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్‌ సరస్సు ఒకటి అని మా నాన్న (రాజీవ్‌ గాంధీ) చెప్పేవారు’’ అని ట్వీట్‌ చేశారు. ఆదివారం రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా పాంగాంగ్‌ నది ఒడ్డున రాహుల్‌ నివాళి అర్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని