Bullet Train: అహ్మదాబాద్‌ - ముంబయి బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో కీలక మైలు రాయి.. వీడియో షేర్‌ చేసిన అశ్వినీ వైష్ణవ్‌

బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కీలక ప్రక్రియ పూర్తయింది. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ షేర్‌ చేశారు. 

Published : 24 Nov 2023 17:04 IST

దిల్లీ: అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ ట్రైన్‌ (Ahmedabad-Mumbai Bullet Train) ప్రాజెక్ట్‌లో కీలక ప్రక్రియ పూర్తైందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ ఖాతాలో షేర్‌ చేశారు. ‘‘బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌లో పురోగతి.. 251.40 కి.మీ మేర పిల్లర్లు, 103.24 కి.మీ మేర ఎలివేటెడ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం’’ అని వీడియోను ట్వీట్ చేశారు. ఇందులో బాక్స్‌ గిర్డర్లు, సెగ్మెంటల్‌ గిర్డర్లు నిర్మాణం పూర్తైంది. 

ఈ ప్రాజెక్ట్‌ను జాతీయ హై-స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NHSRCL) పర్యవేక్షిస్తుంది. ‘‘గుజరాత్‌లో వల్సాద్‌, నవ్‌సారి జిల్లాల్లోని ఆరు నదులపై వంతెనల నిర్మాణం పూర్తి అయింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తొలి గిర్డర్‌ నిర్మాణం 2021 నవంబరు 25న ప్రారంభమైంది. దీన్ని ఆరు నెలల్లో పూర్తి చేశాం. ఫుల్‌ స్పాన్‌ లాంచింగ్ విధానం (FSLM)తో 100 కి.మీ వయాడక్ట్‌ నిర్మాణాన్ని ఏడాది కాలంలో పూర్తి చేశాం. ఇది మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉపయోగించే స్పాన్‌-బై-స్పాన్‌ పద్ధతి కంటే పది రెట్లు వేగంగా జరుగుతుంది. మరోవైపు సూరత్‌లో ట్రాక్‌ బెడ్‌ నిర్మాణం ప్రారంభమైంది. ఇందుకోసం జపనీస్‌ షింకన్‌సేన్‌ ట్రాక్‌ నిర్మాణంలో ఉపయోగించిన విధానాన్నే అనుసరిస్తున్నాం. భారత్‌లో ఈ విధానం ఉపయోగించడం ఇదే తొలిసారి.  ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 28 స్టీలు వంతెనలు రానున్నాయి. ఇందులో మొదటి వంతెన నిర్మాణం గుజరాత్‌లోని వల్సాద్‌ జిల్లాలో ప్రారంభమైంది’’ అని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

సొరంగం నుంచి స్ట్రెచర్‌పై బయటికి.. రెస్క్యూ ట్రయల్‌ రన్‌ నిర్వహించిన ఎన్డీఆర్‌ఎఫ్‌

ఈ రైలు కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. ఒకసారి ఈ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అహ్మదాబాద్‌ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్‌లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. బుల్లెట్‌ ట్రైన్‌ తొలి ట్రయల్స్‌ను 2026లో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా గంటకు 350 కి.మీ. వేగంతో బుల్లెట్‌ ట్రైన్‌ పరుగులు పెడుతుందని, ఇది విమానం టేకాఫ్‌ అయ్యే వేగంతో సమానమని తెలిపారు. అయితే, ప్రజలకు అందుబాటులోకి వచ్చాక గరిష్ఠంగా 320 కి.మీ. వేగంతో నడపనున్నట్లు  అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ విలువ రూ.1.08 లక్షల కోట్లు. దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.10 వేల కోట్లు, గుజరాత్‌, ముంబయి రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.5 వేల కోట్లు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌కు కేటాయించనున్నాయి. మిగిలిన మొత్తాన్ని జపాన్‌ ప్రభుత్వం రుణ రూపంలో అందివ్వనుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని