Job Recruitment: ఆ స్కూళ్లలో 38వేల పోస్టులు మూడేళ్లలో భర్తీ: కేంద్రమంత్రి

Central Government Job Recruitment: ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 38,800 ఉద్యోగాలను కేంద్రం మూడేళ్లలో భర్తీ చేస్తుందని కేంద్రమంత్రి అర్జున్‌ ముండా వెల్లడించారు.

Updated : 14 Jun 2023 20:27 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో (EMRS) భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్టు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖమంత్రి అర్జున్‌ ముండా (Arjun Munda) వెల్లడించారు. వచ్చే మూడేళ్లలోనే కేంద్రం 38,800 ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బందిని భర్తీ చేస్తుందని చెప్పారు. ఆదివాసీ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం 1997-98లో ఏకలవ్య పాఠశాలల (Eklavya Model Residential Schools) పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆ స్కూళ్ల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. 2013-14 నాటికి దేశ వ్యాప్తంగా 119 స్కూళ్లు ఉండగా.. 2023-24 నాటికి ఆ సంఖ్య 401కి చేరిందని మంత్రి తెలిపారు. 2013-14 నాటికి ఆయా స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య 34,365 కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 1,13,275కి చేరిందని వెల్లడించారు. 

2019లో కేంద్రం రూపొందించిన కొత్త పథకంలో భాగంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 50 శాతం/ అంతకన్నా ఎక్కువ ఎస్టీ జనాభా లేదా కనీసం 20వేల మంది ఆదివాసీలు ఉన్న ప్రతి బ్లాక్‌లో ఒక ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో 2025-26 నాటికి దేశవ్యాప్తంగా గుర్తించిన 740 బ్లాక్‌లలో EMRSలను ఏర్పాటు చేయడంపై కేంద్రం దృష్టిపెట్టిందని కేంద్రమంత్రి అర్జున్‌ ముండా తెలిపారు. ఈ పాఠశాలల్లో రాబోయే మూడేళ్లలో 38,800 బోధన, బోధనేతర సిబ్బంది నియామకం చేపట్టనున్నట్టు చెప్పారు. తద్వారా ఈ స్కూళ్లలో దాదాపు 3.5లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఇప్పటివరకు మొత్తం 693 స్కూళ్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. వీటిలో 175 పాఠశాలల్లో స్మార్ట్‌ తరగతులు నిర్వహించేందుకు  కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ఏర్పాట్లు చేస్తోందన్నారు. 

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 38,800 పోస్టుల భర్తీకి నిబంధనల పేరుతో ఇటీవల నేషనల్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ట్రైబల్‌ స్టడీస్‌ సంస్థ ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో పోస్టుల సంఖ్యతో పాటు ఆ ఉద్యోగాలకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, అనుభవం, వేతనం తదితర వివరాలన్నీ పొందుపరిచింది. ఆ వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని