Cervical Cancer: త్వరలో సర్వైకల్‌ క్యాన్సర్‌ దేశీయ టీకా.. ధర ఎంతంటే..?

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (Cervical cancer)ను ఎదుర్కొనే తొలి దేశీయ టీకా త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Published : 02 Sep 2022 01:20 IST

దిల్లీ: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ (Cervical cancer)ను ఎదుర్కొనే తొలి దేశీయ టీకా త్వరలోనే అందుబాటులోకి రానుంది. సామాన్యులకు అందుబాటులోనే టీకా ధర ఉండనున్నట్లు తయారీ సంస్థ వెల్లడించింది. మార్కెట్‌లో దీని ధర రూ.200 నుంచి 400 మధ్య ఉండవచ్చని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII) సీఈఓ అదర్‌ పూనావాలా వెల్లడించారు. అయితే, కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత తుది ధర నిర్ణయిస్తామన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం రెండు, మూడు విదేశీ టీకాలు భారత్‌ మార్కెట్లో ఉన్నప్పటికీ.. తొలి దేశీయ టీకా (CERVAVAC) మాత్రం ఇదే. ఈ ఏడాది చివరిలోగా అందుబాటులోకి రానుంది.

సర్వైకల్‌ క్యాన్సర్‌ను (Cervical cancer) ఎదుర్కొనే క్యూహెచ్‌పీవీ (HPV) టీకాను డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ భాగస్వామ్యంతో సీరం ఇన్‌స్టిట్యూట్‌ దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఈ టీకా (CERVAVAC) ప్రయోగాలు పూర్తికాగా.. భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) కూడా ఈ టీకా మార్కెట్‌కు జులైలోనే ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన శాస్త్రీయ ప్రక్రియను పూర్తిచేసుకొని త్వరలో మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా సీరం ఛీప్‌ అదర్‌ పూనావాలా మాట్లాడుతూ.. సర్వైకల్‌ క్యాన్సర్‌కు ప్రస్తుతం వినియోగిస్తోన్న టీకాలతో పోలిస్తే దీని ధర చాలా తక్కువ అన్నారు. సుమారు రూ.200 నుంచి రూ.400 మధ్య అంటుందన్న ఆయన.. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏడాది చివర్లో అందుబాటులోకి వస్తోందని.. 20కోట్ల డోసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు చెప్పారు. తొలుత దేశంలోనే ఈ వ్యాక్సిన్‌ అందిస్తామని.. దేశీయ అవసరాలు తీరిన తర్వాతే విదేశాలకు ఎగుమతి చేసే అంశాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.

ఇదిలాఉంటే, దేశంలో అత్యధికంగా వెలుగు చూస్తోన్న క్యాన్సర్‌లలో సర్వైకల్‌ క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) వల్ల వచ్చే ఈ క్యాన్సర్‌ 15 నుంచి 44 ఏళ్ల మహిళల్లో అధికంగా కనిపిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా దాదాపు 6లక్షల కేసులు నమోదవుతుండగా.. అందులో 3లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్‌లో ఈ క్యాన్సర్‌ ప్రాబల్యం అధికంగా ఉంది. ప్రస్తుతం దీనికి రెండు, మూడు విదేశీ టీకాలు అందుబాటులో ఉండగా వాటి ధర దాదాపు రూ.4వేల వరకు ఉంది. దేశీయంగా తయారు చేసిన టీకాను కేవలం రూ.200 నుంచి రూ.400ల్లోపే ఉండడం ఊరట కలిగించే విషయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని