Chargesheet: ఛార్జ్‌షీట్‌లను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచలేం : సుప్రీంకోర్టు

దర్యాప్తు సంస్థలు వేసే ఛార్జ్‌షీట్లు (Chargesheet) పబ్లిక్‌ డాక్యుమెంట్లు కావని.. వాటిని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచలేమని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది.

Published : 20 Jan 2023 14:59 IST

దిల్లీ: పోలీసులు, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు క్రిమినల్‌ కేసుల్లో వేసే ఛార్జ్‌షీట్లపై (Chargesheet) భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. స్వేచ్ఛ పొందేందుకు అవి ప్రజా దస్త్రాలు కావని.. వాటిని జన బాహుళ్యంలో (Public Domain) ఉంచలేమని స్పష్టం చేసింది. ఛార్జ్‌షీట్లు పౌరులందరికీ అందుబాటులో ఉంచాలని సౌరవ్‌ దాస్‌ అనే జర్నలిస్ట్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విధంగా స్పందించింది.

‘ఛార్జ్‌షీట్‌ (Chargesheet) అనేది ప్రజాదస్త్రం కాదు. దానిని ఆన్‌లైన్‌ వేదికల్లో అందుబాటులో ఉంచలేం. కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ)లోని నిబంధనలకు  ఇది విరుద్ధం’ అని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన విచారణను జనవరి 9నే ముగించింది. తీర్పును రిజర్వులో ఉంచిన సుప్రీంకోర్టు తాజాగా దానిని వెలువరించింది. ఈ సందర్భంగా ఎఫ్‌ఐఆర్‌లపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం.. కేసుకు సంబంధం లేని అధిక ప్రసంగికులు, ఎన్జీవోలకు ఎఫ్‌ఐఆర్‌లను ఇవ్వడం దుర్వినియోగానికి దారితీస్తుందని మౌఖికంగా అభిప్రాయపడింది. అయితే, ఎఫ్‌ఐఆర్‌ను ఛార్జ్‌షీట్‌తో సరిపోల్చలేమని పేర్కొంది.

పిటిషినర్‌ తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్‌ ప్రశాంత్‌ భూషణ్‌.. సమాచారాన్ని స్వచ్ఛందంగా అందుబాటులో ఉంచడం ప్రతి ప్రభుత్వ విభాగం బాధ్యత అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఛార్జ్‌షీట్లలో కొంత సమాచారం లీక్‌ అవడం వంటివి అసత్య వార్తలు, గందరగోళానికి దారి తీస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఎవరు నిందితుడు, నేరాన్ని ఎవరు చేశారనే విషయాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని గుర్తుచేశారు. అయినా.. వీటిని పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని