Updated : 12/11/2021 20:00 IST

pok: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా రహస్య సర్వే..!

* సమన్వయం పెంపునకు ఇరుదేశాల యత్నాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత వ్యూహకర్తల నోటివెంట తరచూ వినిపించే పదం ‘టూఫ్రంట్‌ వార్‌’. అంటే ఏకకాలంలో చైనా, పాక్‌ సైన్యాలను భారత్‌ ఎదుర్కోవాల్సిరావడం. ఇటీవల కాలంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు మన వ్యూహకర్తల అంచనాలకు తగ్గట్లే ఉంటున్నాయి. పాక్‌-చైనాల మధ్య సైనిక సహకారం పెరిగిపోయింది. ఇటీవలే చైనా అత్యాధునిక ఫ్రిగేట్‌ను పాకిస్థాన్‌కు బహూకరించింది. ఈ వార్త పూర్తిగా కనుమరుగు కాకముందే మరో విషయం బయటకు వచ్చింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా దళాల కదలికలు పెరిగిపోయాయి. అదే సమయంలో పీఎల్‌ఏ దళాలకు సహకరించేందుకు పాక్‌ అధికారులు చైనా చేరుకొన్నారు.   

పీవోకే సరిహద్దు పోస్టుల్లో సమాచార సేకరణ..

చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సిబ్బంది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని సరిహద్దు చెక్‌పోస్టులు, గ్రామాల్లో రహస్య సర్వే నిర్వహించారు. ఈ విషయాన్ని భారతీయ దళాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. దాదాపు 40 మందికిపైగా చైనా సైనికులను నీలం వ్యాలీ, కెల్‌, జురా,లీపా సెక్టార్లలో నెల రోజుల క్రితం గుర్తించారు. వారు ఐదు నుంచి ఆరుగురు సభ్యుల బృందాలుగా విడిపోయి పీవోకేలోని పలు గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు అక్కడ అత్యాధునిక గ్రామాలను నిర్మించేందుకు ఆసక్తి చూపారు. ఈ గ్రామాలు సైనిక, పౌర అవసరాలకు వినియోగించవచ్చు. ఇటువంటి గ్రామాన్నే అరుణాచల్‌ సరిహద్దుల్లో వివాదాస్పద ప్రదేశంలో చైనా నిర్మించింది.   

పీఎల్‌ఏ ఫార్మేషన్‌ హెడ్‌క్వార్టర్స్‌లో పాక్‌ సైనిక అధికారులు..

భారత్‌ సరిహద్దు బాధ్యతలను చైనాలోని పశ్చిమ థియేటర్‌ కమాండ్‌ చూసుకొంటోంది. దీనికి కమాండర్‌గా ఇటీవలే వాంగ్‌ హెజాంగ్‌ను నియమించారు. ఇక చైనా సెంట్రల్‌ మిలటరీ కమిషన్లోని జాయింట్‌ స్టాఫ్‌ డిపార్ట్‌మెంట్‌లో పాకిస్థాన్‌కు చెందిన కర్నల్‌ ర్యాంక్‌ అధికారిని నియమించినట్లు సమాచారం. ఇరు దేశాలు సేకరించే ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని పంచుకోవడానికి వీలుగా ఈ నియామకం జరిగింది. చైనా సైన్యం దాడులు చేయడానికి, శిక్షణ, ప్లానింగ్‌, వ్యూహాల తయారీ బాధ్యత సెంట్రల్‌  మిలటరీ కమిషన్‌దే. దీంతోపాటు చైనాలోని పాకిస్థాన్‌ దౌత్యకార్యాలయంలో దాదాపు 10 మంది పాక్‌ సైనిక అధికారులను ‘డిఫెన్స్‌ అటాచీ’లుగా నియమించింది. వీరు చైనా నుంచి ఆయుధ సమీకరణకు పాక్‌కు చేదోడు వాదోడుగా ఉంటారు.

సీపెక్‌ రక్షణకు ప్రత్యేక దళం..

చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ రక్షణ నిమిత్తం 9,000 మంది సైనికులు, 6,000 మంది పారామిలటరీ సిబ్బందితో ఓ దళాన్ని ఏర్పాటు చేసినట్లు డాన్‌ పత్రిక 2016లో వెల్లడించింది. సీపెక్‌ , చైనా ఉద్యోగుల రక్షణ నిమిత్తం డివిజన్‌ స్థాయిలో భద్రతా దళాన్ని ఏర్పాటు చేస్తామని పాక్‌ 2019లో పేర్కొంది.

చైనా నుంచి పాక్‌కు దండిగా ఆయుధాలు..

చైనా నుంచి పాకిస్థాన్‌కు కుప్పలు తెప్పలుగా ఆయుధాలు చేరుతున్నాయి. ఇటీవలే చైనా స్టేట్‌ షిప్‌ బిల్డింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిర్మించిన టైప్‌ 054ఏ/పి ఫ్రిగేట్‌ను పాక్‌ నావికా దళానికి అందజేశారు. ఈ ఏడాది ఆరంభంలో చైనా ప్రభుత్వ రంగ సంస్థ నోరింకో తయారు చేసిన వీటీ-4 ట్యాంకులను పాక్‌ సైన్యంలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే వింగ్‌లూంగ్‌ శ్రేణి సాయుధ డ్రోన్ల విక్రయాలకు రంగం సిద్ధమైంది. 

ఇరు దేశాలు సంయుక్త సైనిక విన్యాసాల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుకొంటూ వెళుతున్నాయి. గతేడాది పీఎల్‌ఏ, పాక్‌ వాయుసేన కలిసి సింధ్‌లో ‘షహీన్‌-9’ యుద్ధవిన్యాసాలను నిర్వహించాయి. సాధారణ యుద్ధవిన్యాసాలను మిత్ర దేశాల మధ్య అవగాహన పెంచుకోవడానికి, రణక్షేత్రంలో సమన్వయ పర్చుకోవడానికి నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది మే నెలలో ఉభయ దేశాల సైన్యాలు టిబెట్‌ రీజియన్‌లో కూడా యుద్ధ విన్యాసాలను నిర్వహించాయి. 


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని