Grievance Cell: ఆ ఉన్నతాధికారులు దేవుళ్లలా ప్రవర్తిస్తారు.. గుజరాత్‌ హైకోర్టు

పోలీసులపై ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌ సెల్‌కు ప్రచారం కల్పించే విషయంలో అహ్మదాబాద్‌ జిల్లా ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై గుజరాత్‌ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Published : 04 Nov 2023 01:49 IST

గాంధీనగర్: పోలీసులపై ఫిర్యాదులకు ఉద్దేశించిన ఫిర్యాదుల విభాగాని(Grievance cell)కి ప్రచారం కల్పించే విషయంలో జిల్లా ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంపై గుజరాత్‌ హైకోర్టు (Gujarat High Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక్కడి కలెక్టర్ (DM), పోలీసు కమిషనర్‌ వంటి అధికారులు దేవుళ్లలా ప్రవర్తిస్తారని, వారు సామాన్య పౌరులకు అందుబాటులో ఉండరని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలోనే ఫిర్యాదుల విభాగానికి సంబంధించి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని, దాని గురించి ప్రజలకు స్పష్టమైన రీతిలో అవగాహన కల్పించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సునీతా అగర్వాల్ ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్.. ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అహ్మదాబాద్‌లో అర్ధరాత్రి వేళ ప్రయాణిస్తోన్న ఓ జంట నుంచి ట్రాఫిక్ కానిస్టేబుళ్లు డబ్బు వసూలు చేశారనే వార్తాకథనాల ఆధారంగా కోర్టు సుమోటోగా కేసును స్వీకరించి.. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారిస్తోంది. తప్పు చేసిన పోలీసులపై ఫిర్యాదుల నమోదుకు వీలుగా చర్యలు తీసుకోవాలని గతంలో జారీ చేసిన ఆదేశాల మేరకు ఫిర్యాదు విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది డివిజన్‌ బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ‘ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయగానే సరిపోదు. ఫిర్యాదు కోసం ఎక్కడికెళ్లాలో, ఎవరిని సంప్రదించాలో సామాన్యులెవరికీ తెలియదు. వారంతా మీ కార్యాలయం ముందు నిలబడాలని భావిస్తున్నారా? వారిని ఆఫీస్‌లోకి ఎవరు రానిస్తారు? ఒక సామాన్యుడు పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించడం అంత సులభం కాదు. ఇక పోలీసు కమిషనర్, కలెక్టర్‌ కార్యాలయాల సంగతి చెప్పనక్కర్లేదు. మీ జిల్లా కలెక్టర్‌, పోలీసు కమిషనర్లు దేవుళ్లు, మహారాజుల్లా ప్రవర్తిస్తారు. ఇవన్నీ క్షేత్రస్థాయి వాస్తవాలు’ అని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ మౌఖికంగా వ్యాఖ్యానించారు.

సినిమా డైలాగ్‌ను ప్రస్తావిస్తూ.. కేసుల వరుస వాయిదాలపై సీజేఐ అసహనం

ఇదిలా ఉండగా.. రెండు నెలల క్రితం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి క్యాబ్‌లో ఇంటికెళ్తున్న దంపతులను ఇద్దరు ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుళ్లు, ట్రాఫిక్ బ్రిగేడ్ జవాన్ అడ్డుకున్నారు. అర్ధరాత్రి వేళ ప్రయాణం నిబంధనల ఉల్లంఘనే అని బెదిరిస్తూ.. విడిచిపెట్టేందుకుగానూ రూ.60 వేలు వసూలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏడాదిన్నర కుమారుడితో కలిసి భార్య కారులోనే ఉండగా.. అతడిని బలవంతంగా ఏటీఎంకు తీసుకెళ్లి మరీ డబ్బు డ్రా చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వార్తాకథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి, విచారణ చేపడుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని