Supertech: ఆ 40 అంతస్తుల ట్విన్‌ టవర్ల కూల్చివేత 2 వారాల్లో ప్రారంభించండి..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో 40 అంతస్తుల జంట భవనాల(ట్విన్‌ టవర్స్‌) కూల్చివేత అంశంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో ఆ కట్టడాల

Updated : 07 Feb 2022 17:23 IST

నోయిడా అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో 40 అంతస్తుల జంట భవనాల(ట్విన్‌ టవర్స్‌) కూల్చివేత అంశంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో ఆ కట్టడాల కూల్చివేతను ప్రారంభించాలని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం అధికారులను ఆదేశించింది. నోయిడా అధికారులు 72 గంటల్లోగా సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. 

నిబంధనలు ఉల్లంఘిస్తూ నొయిడాలోని సెక్టార్‌ 93లో సూపర్‌టెక్‌ సంస్థ నిర్మించిన ట్విన్ టవర్స్‌ను అక్రమ నిర్మాణాలని సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టులో తేల్చిన విషయం తెలిసిందే. ఈ భవన నిర్మాణాలపై దాఖలైన పిటిషన్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. 3 నెలల్లోగా వాటిని కూల్చివేయాలని ఆదేశించింది. ఈ మేరకు గతంలో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. కూల్చివేత ఖర్చు మొత్తాన్ని సూపర్‌టెక్‌ భరించాలని ఆదేశాలు జారీచేసింది. అంతేగాక, రెండు టవర్లలో దాదాపు వెయ్యి ఫ్లాట్లు ఉండగా.. వాటిని కొన్న వారందరికీ రెండు నెలల్లోగా 12శాతం వడ్డీతో నగదును తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

అయితే గడువు పూర్తయినా కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. సూపర్‌టెక్‌ యాజమాన్యాన్ని గట్టిగా మందలించింది. కోర్టుతో ఆటలాడితే జైలుకు పంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో భవనం కూల్చివేతకు సూపర్‌టెక్‌ ప్రణాళిక రూపొందించగా.. దానికి నోయిడా అధికారులు అంగీకరించారు. ఆ ప్రణాళికను సంస్థ కోర్టుకు సమర్పించింది. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం.. నేటి నుంచి రెండు వారాల్లోగా కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది. అంతేగాక, ఇళ్ల కొనుగోలుదారులకు ఫిబ్రవరి 29లోగా వడ్డీతో సహా డబ్బులు తిరిగి చెల్లించాలని సూపర్‌టెక్‌ను ఆదేశించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని