Arvind Kejriwal: ఈడీ సమన్ల దాటవేత కేసు.. కేజ్రీవాల్‌కు చుక్కెదురు

ఈడీ సమన్ల దాటవేత కేసులో మెజిస్ట్రేట్‌ కోర్టులో అరవింద్‌ కేజ్రీవాల్‌ విచారణపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ కోర్టు నిరాకరించింది.

Published : 15 Mar 2024 22:36 IST

దిల్లీ: మద్యం కుంభకోణం (Delhi excise policy case) వ్యవహారంలో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు చుక్కెదురైంది. ఈ స్కామ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ (ED) సమన్ల దాటవేత వ్యవహారంలో మెజిస్ట్రేట్‌ కోర్టులో విచారణపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ కోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం ట్రయల్‌ కోర్టును ఆశ్రయించాలని అదనపు సెషన్స్ జడ్జి రాకేశ్‌ సియాల్ కేజ్రీవాల్‌ను ఆదేశించారు.

మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌కు ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఈడీ సమన్లు పంపింది. అయితే, ప్రతిసారీ గైర్హాజరయ్యారు. దీంతో మొదటి మూడు సమన్లకు ఆయన స్పందించలేదని గత నెల మెజిస్ట్రేట్‌ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పుడు విచారణ జరిపిన కోర్టు.. ఫిబ్రవరి 17న రావాలని ఆదేశించింది. అయితే, ఆ సమయంలో అసెంబ్లీ విశ్వాస పరీక్ష ఉన్నందున వర్చువల్‌గా హాజరైన సీఎం.. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

ఈ అంశం కోర్టులో పెండింగ్‌ ఉండగానే ‘ఈడీ’ ఆయనకు మరిన్ని సమన్లు జారీ చేసింది. చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలని పిలవగా.. కేజ్రీవాల్‌ మరోసారి స్పందించలేదు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మార్చి 16వ తేదీన తప్పనిసరిగా హాజరుకావాలని మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సీఎం కేజ్రీవాల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని