DAC: సుఖోయ్‌లు.. సర్వే నౌకలు.. రూ.45 వేల కోట్లతో ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు ఆమోదం

భద్రత బలగాల కోసం రూ.45 వేల కోట్ల రక్షణ ఉత్పత్తుల కొనుగోలుకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. సుఖోయ్‌ విమానాలు, ధ్రువాస్త్ర క్షిపణులు వంటివి సమకూర్చనుంది.

Published : 15 Sep 2023 20:22 IST

దిల్లీ: భద్రత బలగాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ (Defence Ministry) కీలక నిర్ణయం తీసుకుంది. రూ.45 వేల కోట్లతో 12 సుఖోయ్‌ యుద్ధవిమానాలు, ధ్రువాస్త్ర క్షిపణులు సహా ఆయా ఆయుధ వ్యవస్థలు, ఇతరత్రా సమకూర్చేందుకు పచ్చజెండా ఊపింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్‌ అక్వైజిషన్‌ కౌన్సిల్‌ (DAC).. మొత్తం తొమ్మిది ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ దిశగా.. భారతీయ సంస్థల నుంచే ఈ కొనుగోళ్లు చేపట్టనున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది. రక్షణ ఉత్పత్తుల్లో స్వదేశీ సామగ్రి వినియోగాన్ని 50 శాతం నుంచి 60-65 శాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని రాజ్‌నాథ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు.

ఉగ్రపుట్టగా పీర్‌ పంజాల్‌.. రోజుల తరబడి ఎన్‌కౌంటర్లు..!

సైన్యం అవసరాలకు లైట్ ఆర్మర్డ్ మల్టీపర్పస్ వెహికల్స్ (LAMV), ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ అండ్ టార్గెటింగ్ సిస్టమ్ (ISAT-S), హై మొబిలిటీ వెహికల్ (HMV), గన్ టోయింగ్ వాహనాలతో పాటు భారత నౌకాదళం కోసం అధునాతన సర్వే నౌకల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది. డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను మరింత మెరుగుపరిచే విషయంలో వాయుసేన ప్రతిపాదనలకు అనుమతి ఇచ్చింది. దేశీయంగా నిర్మించిన ఏఎల్‌హెచ్ ఎంకే-IV హెలికాప్టర్ల కోసం శక్తిమంతమైన స్వదేశీ ధ్రువాస్త్ర స్వల్పశ్రేణి క్షిపణులు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సామగ్రితో రూపొందించే 12 సుఖోయ్‌ (Su-30 MKI) యుద్ధ విమానాలను సమకూర్చేందుకు డీఏసీ ఆమోదం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని