Delhi: స్నేహితుడి కుమార్తెపై అత్యాచారం కేసు.. సుమోటోగా స్వీకరించిన దిల్లీ హైకోర్టు

దిల్లీలో మైనర్‌ బాలికపై ఓ ఉన్నతాధికారి అత్యాచారం కేసును దిల్లీ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. బాధితురాలికి గుర్తింపు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

Published : 28 Aug 2023 16:18 IST

దిల్లీ: స్నేహితుడి మైనర్‌ కుమార్తెపై ఓ ఉన్నతాధికారి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసును దిల్లీ హైకోర్టు (Delhi High Court) సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలోనే బాధితురాలి వివరాలు ఏ విధంగానూ బహిర్గతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఆమెపై ఇతరులు కూడా లైంగిక వేధింపుల (Sexual Assault)కు పాల్పడ్డారా? అని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఈ కేసుపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, పోలీసులు, దిల్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖలను ఆదేశించింది. బాధితురాలికి తగిన భద్రతతోపాటు పరిహారం ఇవ్వాలని పేర్కొంది.

బాలికపై అత్యాచారం కేసును దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ సంజీవ్‌ నరులాలతో కూడిన ధర్మాసనం సోమవారం ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణ చేపట్టింది. తనపై ఇతర వ్యక్తులూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక ఇచ్చిన వాంగ్మూలంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పోలీసులను ప్రశ్నించింది. ఈ కోణంలోనూ విచారణ జరుపుతామని పోలీసుల తరఫు న్యాయవాది తెలిపారు. బాలిక ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని.. ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

స్నేహితుడి కుమార్తెపై అత్యాచార ఘటన.. ఉన్నతాధికారిపై సస్పెన్షన్‌ వేటు

ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని దిల్లీ ప్రభుత్వం, పోలీసులు, కేంద్ర మహిళాశిశు సంక్షేమ శాఖలను ఆదేశించిన హైకోర్టు ధర్మాసనం.. తదుపరి విచారణను సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది. తామూ ఈ వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకున్నామని, దీనిపై నివేదిక ఇస్తామని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) తరఫు న్యాయవాది తెలిపారు. ఇదిలా ఉండగా.. దిల్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న ఆ సీనియర్‌ అధికారిపై ప్రభుత్వం ఇప్పటికే సస్పెన్షన్‌ వేటు వేసిన విషయం తెలిసిందే. అతడితోపాటు అతడి భార్య ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని