BBC: మోదీపై డాక్యుమెంటరీ.. బీబీసీకి సమన్లు ఇచ్చిన దిల్లీ హైకోర్టు

బీబీసీ తీసిన రెండు భాగాల వివాదాస్పద డాక్యుమెంటరీపై గుజరాత్‌కు చెందిన ఎన్‌జీఓ పరువునష్టం దావా వేసింది. దీంతో తాజాగా దిల్లీ హైకోర్టు బీబీసీకి సమన్లు జారీ చేసింది. 

Published : 22 May 2023 18:18 IST

దిల్లీ: పరువునష్టం కేసులో బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌ (BBC)కు దిల్లీ హైకోర్టు(Delhi High Court) సమన్లు జారీచేసింది. 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ తీసిన వివాదాస్పద లఘుచిత్రంపై గుజరాత్‌కు చెందిన ఎన్‌జీఓ కేసు వేసింది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా సమన్లు జారీ అయ్యాయి.

‘ఈ డాక్యుమెంటరీ దేశం, న్యాయవ్యవస్థ, ప్రధానమంత్రికి పరువునష్టం కలిగించేలా ఉందని పిటిషనర్లు వాదించారు. దీనిపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తున్నాం’ అని సమన్లలో కోర్టు పేర్కొంది. 2002 గుజరాత్ అల్లర్లపై ‘ఇండియా.. ది మోదీ క్వశ్చన్’ పేరిట బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. దానిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. అదొక విద్వేషపూరిత చర్యగా అభివర్ణించింది. ఇదో ప్రచార కార్యక్రమం మాత్రమేనని, వారు ఎంచుకున్న కోణాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే దీనిని రూపొందించారని ఇది వరకు కేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ రెండు భాగాల డాక్యుమెంటరీపై గుజరాత్‌కు చెందిన ఎన్‌జీఓ ‘జస్టిస్‌ ఆన్‌ ట్రయల్‌’ దీనిపై పరువు నష్టం దావా వేసింది. భారత దేశం, ఇక్కడి న్యాయవ్యవస్థను అవమానించేలా ఆ డాక్యుమెంటరీ ఉందంటూ బీబీసీపై ఫిర్యాదు చేసింది.

ఈ డాక్యుమెంటరీ ప్రసారమైన సమయంలోనే బీబీసీ ఇండియా (BBC India) కార్యాలయంలో ఐటీశాఖ తనిఖీలు నిర్వహించింది. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ (ED) కూడా కేసు నమోదుచేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని