
Firecrackers: దిల్లీలో 6వేల కిలోల బాణసంచా సీజ్
దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో పోలీసులు 6 వేల కిలోల బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. 55 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. దీపావళి పండుగ నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో బాణసంచా కాల్చడాన్ని దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ నిషేధించింది. వచ్చే ఏడాది జనవరి 1 వరకు బాణసంచాలు పేల్చొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ముందుస్తు చర్యగా పోలీసులు బాణసంచా తయారీ సంస్థలను, దుకాణాలను మూసివేయించారు.
అయినా అక్రమంగా, పొరుగురాష్ట్రాల నుంచి బాణసంచా తరలిస్తున్నారు. దీంతో దిల్లీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నార్త్ డిస్ట్రిక్ట్‌లో 2,400 కిలోలు, రోహిణి డిస్ట్రిక్ట్‌లో 1,153 కిలోలు, సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లో 298 కిలోల బాణసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని కొందరు ఉత్తరప్రదేశ్, హరియాణా నుంచి భారీ మొత్తంలో కొనుగోలు చేసి దిల్లీలో అక్రమంగా విక్రయించడానికి తీసుకొస్తున్నట్లు గుర్తించారు.