Vistara: రన్‌వేపై శునకం.. గోవాలో దిగాల్సిన విమానం తిరిగి బెంగళూరుకే!

రన్‌వేపై ఓ శునకం సంచరిస్తుండటంతో.. అక్కడ దిగాల్సిన ఓ విమానం వెనక్కి వెళ్లిపోయింది. గోవా విమానాశ్రయంలో ఈ ఘటన వెలుగుచూసింది.

Updated : 14 Nov 2023 14:02 IST

పనాజీ: రన్‌వేపై ఓ వీధి శునకం ప్రత్యక్షం కావడంతో.. ఆ సమయంలో ల్యాండ్‌ కావాల్సిన విమానం కాస్త వెనుదిరిగిపోయింది. గోవాలోని డాబోలిమ్‌ విమానాశ్రయం (Dabolim Airport)లో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారుల వివరాల ప్రకారం.. విస్తారా (Vistara)కు చెందిన ఓ విమానం సోమవారం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గోవాకు బయల్దేరింది. ఈ క్రమంలోనే ఇక్కడి డాబోలిమ్‌ ఎయిర్‌పోర్టులో దిగేందుకు సిద్ధమైంది. అంతలోనే రన్‌వేపై ఓ శునకాన్ని గుర్తించిన ఏటీసీ అధికారులు వెంటనే పైలట్‌ను అప్రమత్తం చేశారు. కొద్దిసేపు వేచి ఉండాలని సూచించారు.

నగరాల్లో సరకు రవాణాకు సులువైన యాప్‌

అయితే, పైలట్‌ మాత్రం విమానాన్ని వెనక్కి మళ్లించేందుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు గోవా విమానాశ్రయ అధికారులు తెలిపారు. దీంతో విమానం కాస్త తిరిగి బెంగళూరుకు చేరుకుంది. అక్కడినుంచి సాయంత్రం మరోసారి గోవాకు బయల్దేరి.. ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. రన్‌వే ఆంక్షల కారణంగానే బెంగళూరు- గోవా విమానాన్ని మళ్లించినట్లు విస్తారా విమానయాన సంస్థ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించింది. ఇదిలా ఉండగా.. రన్‌వేపై శునకాలు సంచరించడం అరుదైన ఘటన అని పేర్కొన్న విమానాశ్రయ అధికారులు.. క్షేత్రస్థాయి సిబ్బంది వెంటనే పరిస్థితిని చక్కదిద్దినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని