Agnipath: నిరుద్యోగుల సహనానికి ‘అగ్నిపరీక్ష’ పెట్టొద్దు : రాహుల్ గాంధీ

నిరుద్యోగుల గళాన్ని వినాలని.. అగ్నిపథ్‌తో ముందుకు వెళ్తూ వారి సహనానికి ‘అగ్నిపరీక్ష’ పెట్టవద్దని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ పేర్కొన్నారు.

Updated : 16 Jun 2022 18:53 IST

కాలపరిమితి పెట్టొద్దన్న అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ: సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ పథకాన్ని వ్యతిరేకిస్తూ నిరుద్యోగ యువత ఆందోళన కార్యక్రమాలు చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో నిరుద్యోగుల గళాన్ని వినాలని.. అగ్నిపథ్‌తో ముందుకు వెళ్తూ వారి సహనానికి ‘అగ్నిపరీక్ష’ పెట్టవద్దని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హితవు పలికారు. త్రివిధ దళాల్లో నాలుగేళ్లపాటు సైనిక నియామకాలు చేపట్టే ఈ అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ బిహార్‌లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఈ విధంగా స్పందించారు.

‘నో ర్యాంక్‌-నో పెన్షన్‌, రెండేళ్లపాటు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ చేపట్టకపోవడం, నాలుగేళ్ల తర్వాత భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడం, సైన్యంపై ప్రభుత్వానికి గౌరవం లేదనే విషయం స్పష్టమవుతోంది’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో దేశంలో నిరుద్యోగుల గళాన్ని వినాలని.. అగ్నిపథ్‌తో ముందుకెళ్తూ వారి సహనానికి అగ్నిపరీక్ష పెట్టవద్దని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇక ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకగాంధీ వాద్రా.. సైన్యంలో నియామకాలను ప్రయోగశాలగా ఎందుకు మారుస్తున్నారంటూ ప్రశ్నించారు.

కాల పరిమితి పెట్టొద్దు..

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ ద్వారా కొత్తగా నియామకమయ్యే వారికి నాలుగేళ్ల కాలపరిమితి పెట్టవద్దని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన నిరుద్యోగులకు మద్దతు పలికిన ఆయన.. వారి డిమాండ్లు సరైనవేనన్నారు. దేశానికి సైన్యం ఎంతో గర్వకారణమని.. అటువంటి సైన్యంలో తమ జీవితం మొత్తం సేవలందించాలని కోరుకునే యువత కలలకు నాలుగేళ్లతో ముడిపెట్టవద్దన్నారు.

ఇదిలాఉంటే, త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఈ ఒక్క ఏడాదే 17.5ఏళ్ల వయసు నుంచి 21 మధ్య వయసున్న 46వేల మంది యువకులను నియమించుకునేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా ఇందులో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కల్పిస్తామని ప్రకటించింది. నాలుగేళ్ల సర్వీసు పూర్తైన తర్వాత.. ప్రతి బ్యాచ్‌లోని 25శాతం మంది అగ్నివీరులు మాత్రమే సైన్యంలో కొనసాగే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని