Education: అమ్మానాన్నలూ.. పిల్లల్ని ఇలా సిద్ధం చేయండి!

తాత్కాలికంగా చదువుకు దూరమైన చిన్నారులను.. చురుగ్గా ఉంచేందుకు కేంద్ర విద్యాశాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

Updated : 19 Jun 2021 16:13 IST

పాఠశాలలు మూసివున్న వేళ.. విద్యాశాఖ మార్గదర్శకాలు

దిల్లీ: కరోనా వైరస్‌తో మనకెన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. పిల్లల భవిష్యత్తుపై మాత్రం గట్టి దెబ్బే కొడుతోంది. ఏడాదిన్నర కాలంగా విద్యాసంస్థలు సరిగా నడవకపోవడంతో వారు ఇంటికే పరిమితం కావాల్సి వస్తోంది. తాత్కాలికంగా చదువుకు దూరమైన చిన్నారులను.. చురుగ్గా ఉంచేందుకు కేంద్ర విద్యాశాఖ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇల్లే మొదటి పాఠశాలంటూ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్రను గుర్తుచేసింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించింది.

‘ఇల్లే మొదటి పాఠశాలని, తల్లిదండ్రులే మొదటి గురువులని నేను దృఢంగా భావిస్తాను. ఈ మహమ్మారి వేళ.. పిల్లల ఎదుగుదలలో, నేర్చుకోవడంలో వారిదే కీలక పాత్ర’ అని విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పొఖ్రియాల్ నిశాంక్ అన్నారు. అమ్మానాన్నలు పిల్లలకు ఏవిధంగా సహకరించగలరో మార్గదర్శకాల్లో విద్యాశాఖ వివరించింది. మూడు సంవత్సరాల వయస్సు నుంచి విద్యార్థి ప్రతిదశలో ఎదుగుదలకు దోహదం చేసే సమాచారాన్ని పొందుపరిచింది. అంతగా చదువుకోని తల్లిదం►డ్రులు, ప్రత్యేక అవసరాలున్న చిన్నారులు, ఒత్తిడిలో ఉన్న పిల్లలకోసం ప్రత్యేక వివరణ ఇచ్చింది. పది చాప్టర్లుగా విడుదల చేసిన మార్గదర్శకాలను విద్యాశాఖ వెబ్‌సైట్‌(www.education.gov.in)లో వీక్షించవచ్చు.

ఆ మార్గదర్శకాల్లో కొన్ని..

• పిల్లలకు నిత్యకృత్యాలను సిద్ధం చేయాలి. అవి సరళంగా ఉండేలా చూడాలి. 

 వారితో మాట్లాడి.. వారు చదువుకోవడానికి, ఆటలకు, ఇతర కార్యక్రమాలకు సమయాన్ని నిర్ణయించండి.

• చిన్నారులతో సన్నిహితంగా మెలగడంతో పాటు, వారి ఎదుట సానుకూల మాటలు, సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోండి.

• మీరు ఏం చేస్తారో.. పిల్లలు దాన్నే అనుసరిస్తారని గుర్తుంచుకోండి. 

• పిల్లలతో సరదాగా గడపడంతో పాటు, మంచి సంబంధాల్ని ఏర్పరచుకోండి. వారికి ఇష్టమైన పాఠ్యాంశం గురించి అడిగి తెలుసుకోండి. 

• కథలు చెప్పడం, పాటలు పాడటం, మెదడుకు పనిపెట్టే ఆటలు ఆడించడం.. చేయండి.

• వారి శారీరక వికాసం కోసం యోగా, వ్యాయామాలపై దృష్టి పెట్టండి. 

• పాఠశాలలకు వెళ్లేందుకు వారిని మానసికంగా సిద్ధంగా ఉంచండి. త్వరలో పాఠశాలలు తెరుస్తారనే భరోసాను ఇవ్వండి. అలాగే అక్కడికి వెళ్లాక తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముందుగానే చెప్పి, సిద్ధం చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని