Published : 25 Jun 2021 18:46 IST

Corona: చైనాలో.. అంతకుముందే కొవిడ్‌ వ్యాప్తి!

బ్రిటన్‌ పరిశోధకుల తాజా అధ్యయనం

లండన్‌: కరోనా వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని చైనా దాచిపెడుతోందా? 2019 డిసెంబర్‌లో ఇది వెలుగు చూసినట్లు చెబుతున్నప్పటికీ.. అంతకుముందే చైనాలో వైరస్‌ వ్యాప్తి చెందిందా? దీనికి అవుననే సమాధానం వస్తోంది. ఇలాంటి అనుమానాలను ఇప్పటికే పలు అధ్యయనాలు వ్యక్తం చేయగా.. తాజాగా బ్రిటన్‌ పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. చైనా పేర్కొన్నట్లుగా డిసెంబరులో కాకుండా అంతకు రెండునెలల ముందే వైరస్‌ వ్యాప్తి చెందినట్లు అంచనా వేస్తున్నారు. బ్రిటన్‌ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయన ఫలితాలు ఓ అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ మూలాలపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. దీన్ని తెలుసుకునేందుకు ఓ వైపు అంతర్జాతీయ స్థాయి దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో వాటి మూలాలను చైనా చెరిపేస్తున్నట్లు తేలింది. ఇదే సమయంలో కరోనా వైరస్ డిసెంబర్‌ 2019లో బయటపడిందని చైనా చెబుతున్నప్పటికీ.. అంతకు రెండు నెలలముందే, అంటే అక్టోబర్‌ నుంచే చైనాలో వైరస్‌ వ్యాప్తి చెందిందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కెంట్‌కు చెందిన డేవిడ్‌ రాబర్ట్‌ బృందం చేసిన అధ్యయనంలో తేలింది.

తొలికేసు నవంబర్‌ 17నే?

కరోనా వైరస్‌ వ్యాప్తి తొలుత ఎప్పుడు మొదలైందనే విషయం తెలుసుకునేందుకు డేవిడ్‌ రాబర్ట్‌ బృందం నడుం బిగించింది. ఇందుకోసం అంతరించిపోయే జాతుల జాడలను తెలుసుకునేందుకు రూపొందించిన ఓ గణిత నమూనాను పరిశోధకులు ఉపయోగించారు. వైరస్‌ కారకాలుగా భావిస్తోన్న జీవజాతుల వీక్షణల ఆధారంగా అంచనా వేశారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తొలిసారి నమోదైన కేసుల వివరాలను రివర్స్‌ నమూనా పద్ధతిలో విశ్లేషించారు. దీనిలో అక్టోబర్‌, నవంబర్‌ మధ్యకాలంలోనే చైనాలో తొలికేసు నమోదైనట్లు గుర్తించారు. నవంబర్‌ 17న వుహాన్‌లో తొలికేసు వెలుగు చూసిందని.. జనవరి 2020 నాటికి ప్రపంచ దేశాలకు వ్యాపించిందనే అంచనాకు వచ్చారు.

తొలుత ఆ ఐదు దేశాల్లో!

కరోనా వైరస్‌ వ్యాప్తి గురించి చైనా అధికారికంగా పేర్కొన్న దానికంటే.. అత్యధిక వేగంగా అది వ్యాప్తి చెందిందని బ్రిటన్‌ నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా చైనా తర్వాత తొలుత మరో ఐదు దేశాలకు 2020 జనవరిలోనే విస్తరించిందని అంచనా వేశారు. ముఖ్యంగా 2020 జనవరి 3న జపాన్‌లో తొలికేసు నమోదుకాగా, జనవరి 7న థాయిలాండ్‌లో తొలికేసు నమోదైనట్లు అంచనా వేశారు. ఇక జనవరి 12న స్పెయిన్‌లో తొలికేసు నమోదుకాగా.. దక్షిణ కొరియాలో జనవరి 14న వైరస్‌ వెలుగు చూసిందని అన్నారు. ఇలా అనతి కాలంలోనే ఆసియా మొత్తం వ్యాపించిన కరోనా వైరస్‌.. జనవరి 16న అమెరికాకు పాకిందని అంచనా వేశారు. ఈ సందర్భంగా కరోనా మూలాలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని.. తదేకంగా కొనసాగుతోన్న వైరస్‌ వ్యాప్తిని అర్థం చేసుకోవడానికి అవి ఎంతో దోహదం చేస్తాయని బ్రిటన్‌ పరిశోధకులు స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో సంభవించే అంటువ్యాధుల వ్యాప్తి క్రమాన్ని తెలుసుకునేందుకు తాజా అధ్యయన విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

చైనా కుటిల యత్నాలు నిజమే: ధ్రువీకరించిన అమెరికా

కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీక్‌ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అందుకు బలాన్నిచ్చే సమాచారాన్ని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనా జన్యుక్రమానికి సంబంధించిన తొలినాళ్ల నివేదికలను అంతర్జాతీయ డేటాబేస్‌ నుంచి చైనా తొలగిస్తున్నట్లు సమాచారం. కొవిడ్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి దర్యాప్తునకు సిద్ధమవుతోన్న వేళ చైనా యత్నాలను అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి బయటపెట్టారు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. తొలినాళ్లలో కరోనా పాజిటివ్‌ కేసులకు సంబంధించిన కీలక సమాచారాన్ని అంతర్జాతీయ డేటాబేస్‌ నుంచి చైనా తొలగిస్తున్న మాట వాస్తవమేనని స్పష్టం చేసింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని