France: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్‌ శుభవార్త.. ఐదేళ్ల షెన్‌జెన్‌ వీసా ఆఫర్‌!

తమ దేశంలో చదువుకున్న భారతీయ విద్యార్థులకు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన షెన్‌జెన్‌ వీసాలను (Schengen visa) జారీ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం మొదలుపెడుతున్నామని ఫ్రాన్స్‌ (Education in France) వెల్లడించింది.

Published : 08 Aug 2023 21:35 IST

దిల్లీ: తమ దేశంలో చదువుకున్న భారతీయ పూర్వ విద్యార్థులకు ఫ్రాన్స్‌ (Education in France) శుభవార్త చెప్పింది. ఐదేళ్ల కాలపరిమితితో కూడిన షెన్‌జెన్‌ వీసాలను (Schengen visa) జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇందుకోసం కొత్త ప్రణాళికను తీసుకొస్తున్నామని ప్రకటించింది. ఇలా 2030 నాటికి 30వేల మంది భారత విద్యార్థులను ఆహ్వానించడమే తమ లక్ష్యమని తెలిపింది. విద్యానైపుణ్యాలను, సాంస్కృతిక బంధాలను పెంపొందించుకోవడంతోపాటు ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకే ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని ఫ్రాన్స్‌ వెల్లడించింది.

‘ఫ్రాన్స్‌లో భారతీయ విద్యార్థి కనీసం ఒక్క సెమిస్టర్‌ గడిపినా.. ఇరు దేశాల మధ్య అనుబంధం ఏర్పడుతుంది. అందుకే ఫ్రాన్స్‌లో కనీసం ఒక సెమిస్టర్‌ చదివి ఉండి, భారత్‌, ఫ్రాన్స్‌ లేదా మరో దేశంలో గుర్తింపు పొందిన సంస్థల్లో మాస్టర్‌ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ స్థాయికి చేరుకున్న వారు ఈ ఐదేళ్ల కాలపరిమితి కలిగిన షెన్‌జెన్‌ వీసాకు అర్హులు’ అని ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయం (France Embassy) వెల్లడించింది. భారత్‌కు చెందిన పూర్వ విద్యార్థులకు కోసమే ఈ విధానాన్ని తీసుకువచ్చామని.. తద్వారా రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశిస్తున్నామని తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్రెంచ్‌ భాషతోపాటు ఇతర విభాగాల్లో సమగ్ర శిక్షణ అందిస్తామని.. తద్వారా భారత విద్యార్థులు వారి చదువుల్లో రాణించడంతోపాటు ఫ్రెంచ్‌ విద్యావ్యవస్థను అలవరచుకోవడం సాధ్యమవుతుందని అభిప్రాయపడింది.

భారతీయ విద్యార్థులకు వీసాలిస్తాం: చైనా

ఫ్రాన్స్‌లో ఇటీవల పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశంతో అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 2030 నాటికి 30వేల మంది విద్యార్థులకు స్వాగతం పలకడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ వెల్లడించారు. ఈ క్రమంలోనే భారతీయ విద్యార్థులు, అక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులకు ఎర్రతివాచీ పరిచేందుకు కొత్త కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా భారత్‌లోని చెన్నై (అక్టోబర్‌ 8), కోల్‌కతా (అక్టోబర్‌ 11), దిల్లీ (అక్టోబర్‌ 13), ముంబయి (అక్టోబర్‌ 15)న ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌లను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫెయిర్‌లో దాదాపు 40కిపైగా ఫ్రాన్స్‌కు చెందిన ఉన్నత విద్యాసంస్థలు పాల్గొంటాయని ఆ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని