Astronaut: భారత వ్యోమగామితో కలిసి అంతరిక్షయానం చేయాలనుంది: ఫ్రాన్స్‌ వ్యోమగామి థామస్

ఇండియన్‌ స్పేస్‌ కాన్‌క్లేవ్‌లో ఫ్రాన్స్‌ వ్యోమగామి థామస్ పెస్కెట్ (Thomas Pesquet) పాల్గొన్నారు. తన అంతరిక్షయాన అనుభవాలను పంచుకున్నారు. 

Published : 09 Oct 2023 22:53 IST

Image: Thom_astro

దిల్లీ: తనకు భారత వ్యోమగామితో కలిసి అంతరిక్షయానం చేయాలని ఉందని ఫ్రాన్స్‌ వ్యోమగామి థామస్ పెస్కెట్ (Thomas Pesquet) అన్నారు. ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌ నిర్వహించిన ఇండియన్‌ స్పేస్‌ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. తన అంతరిక్షయాన అనుభవాలను పంచుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. భూమిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మానవాళికి ఎంతో ఉందని, అంతరిక్షం నుంచి భూమి చాలా సున్నితంగా కనిపిస్తోందని అన్నారు.

బెంగళూరులో ఎయిర్‌క్రాఫ్ట్‌ రికవరీ ట్రైనింగ్‌ స్కూల్‌.. దక్షిణాసియాలోనే మొట్ట మొదటిది!

‘భారత్‌ ఒక ముఖ్యమైన మైలురాయిని దాటేందుకు యత్నిస్తోంది. గగన్‌యాన్ మిషన్ ద్వారా మానవులను అంతరిక్షంలోకి పంపడం నిజంగా ఆకట్టుకుంటుంది. దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. నాకు ఓ కల ఉంది. కనీసం ఒక్క రోజైనా భారతీయ వ్యోమగామితో కలిసి పనిచేయాలని ఉంది. మన రెండు దేశాలకు నమ్మశక్యం కాని అంతరిక్ష పరిశోధన ప్రయోజనాలను తీసుకురావాలనుందని’ చెప్పారు.

థామస్‌ రెండు సార్లు అంతరిక్షయాత్ర చేశారు. 2016-17, 2021 సంవత్సరాల్లో ఆయన రెండు పర్యాయాలు ఆరునెలలపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్యారిస్‌ పర్యటనలో థామస్‌తో సమావేశమయ్యారు. మానవ సహిత అంతరిక్షయానం ప్రాముఖ్యతను ఆయనకు వివరించారు. ఈ కాన్‌క్లేవ్‌లో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వాములకు ప్రాతినిధ్యం వహించే సంస్థ ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌.. జీఐఎఫ్‌ఏఎస్‌, ఫ్రెంచ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌లతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని