Gaganyaan - ISRO: గగన్‌యాన్‌.. ఆగిన టీవీ-డీ1 పరీక్ష

గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1) పరీక్ష చివరి నిమిషంలో ఆగింది. ఉదయం 10 గంటలకు మళ్లీ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది.

Updated : 21 Oct 2023 09:51 IST

శ్రీహరికోట: గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన ‘టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌’ (టీవీ-డీ1) పరీక్షలో చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఐదు సెకన్ల ముందు ప్రయోగాన్ని నిలిపివేశారు. ప్రయోగంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని.. సమస్య ఎక్కడ వచ్చిందో గుర్తిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ వెల్లడించారు. అనంతరం ఉదయం 10 గంటలకు మరోసారి ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమైనట్లు ఇస్రో ట్విటర్‌లో వెల్లడించింది. లోపాన్ని గుర్తించి సరిచేసినట్లు ఇస్రో పేర్కొంది.

ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైంది. శనివారం ఉదయం 8.00 గంటలకే ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. తొలుత వాతావరణం అనూకూలించక 8.45 నిమిషాలకు రీషెడ్యూల్‌ చేశారు. అనంతరం చివరి నిమిషంలో సాంకేతిక లోపం కారణంగా పరీక్షను ఇస్రో శాస్త్రవేత్తలు హోల్డ్‌లో పెట్టారు. 

ఏమిటీ పరీక్ష?

గగన్‌యాన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములను నేల నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపాలన్నది ఇస్రో లక్ష్యం. మూడు రోజుల తర్వాత వారిని భూమికి రప్పిస్తుంది. 2025లో ఈ యాత్ర జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా కొన్ని కీలక పరిజ్ఞానాలపై కొన్నేళ్లుగా ఇస్రో కసరత్తు చేస్తోంది. ఇప్పుడు వాటిని గగనతలంలో పరీక్షించనుంది. మొదటగా టీవీ-డీ1 పరీక్షను నిర్వహిస్తోంది. ఇందులో క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ సమర్థత, క్రూ మాడ్యూల్‌ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్‌ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలిస్తుంది. అలాగే సాగర జలాల్లో పడే క్రూ మాడ్యూల్‌ను సేకరించి, తీరానికి చేర్చే కసరత్తునూ పరీక్షిస్తుంది.

క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ ఎందుకు?

మానవసహిత వ్యోమనౌకతో నింగిలోకి బయలుదేరిన వెంటనే రాకెట్‌లో ఏదైనా లోపం ఉత్పన్నమైనప్పుడు వ్యోమగాముల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో.. వారు కూర్చొనే క్రూ మాడ్యూల్‌ను రాకెట్‌ నుంచి వేరు చేసి, సురక్షితంగా కిందకి తీసుకురావాలి. దీన్ని క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌(సీఈఎస్‌) అంటారు. ఇది ఒకరకంగా ‘ఎమర్జెన్సీ ఎగ్జిట్‌’ అన్నమాట! ఆ వ్యవస్థ సమర్థతను ఇప్పుడు పరీక్షిస్తున్నారు.

  • క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ చాలా చురుగ్గా, మెరుపు వేగంతో పనిచేయాలి. ఈ దిశగా క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ కోసం ‘క్విక్‌ రియాక్టింగ్‌ సాలిడ్‌ మోటార్ల’ను ఇస్రో అభివృద్ధి చేసింది. ఇవి చాలా వేగంగా ప్రజ్వరిల్లి, అధిక థ్రస్టును ఉత్పత్తి చేస్తాయి. మొత్తం ఐదు రకాల రాకెట్‌ మోటార్లు ఇందులో ఉంటాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని