Pawar-Adani: శరద్‌ పవార్‌తో గౌతమ్‌ అదానీ భేటీ!

Gautam Adani - Sharad Pawar..కొద్ది రోజుల క్రితం అదానీ సంస్థలపై (Adani Group) హిండెన్‌బర్గ్‌ (Hindenburg Research) నివేదిక ఉద్దేశపూర్వకం కావచ్చని ఎన్సీపీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయనతో గౌతమ్‌ అదానీ (Gautam Adani) భేటీ కావడం చర్చనీయాంశమైంది. 

Published : 20 Apr 2023 19:55 IST

ముంబయి: అదానీ సంస్థలపై (Adani Group) హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ (Hindenburg Research) నివేదికపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ (Gautam Adani), ఎన్సీపీ (NCP) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar)తో ముంబయిలోని ఆయన నివాసం సిల్వర్‌ ఓక్‌లో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొద్దిరోజుల క్రితం అదానీకి అనుకూలంగా శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరువురి భేటీ రాజకీయ వర్గాలతోపాటు, పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

 ఏప్రిల్‌ రెండో వారంలో ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శరద్‌ పవార్‌ మాట్లాడుతూ.. అదానీ సంస్థలపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక ఉద్దేశపూర్వకం కావచ్చని వ్యాఖ్యానించారు. ఆయన ఏదైనా తప్పు చేసుంటే దానిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు. పవార్‌ వ్యాఖ్యలపై అప్పట్లో కాంగ్రెస్‌ స్పందిస్తూ.. పార్టీ పరంగా ఎన్సీపీకి మరో అభిప్రాయం ఉండొచ్చని వ్యాఖ్యానించింది. తాజాగా శరద్‌ పవార్‌తో గౌతమ్‌ అదానీ భేటీ కావడంతో వారు దేని గురించి చర్చించారనే దానిపై ఆసక్తి నెలకొంది. 

అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని హిండెన్‌బర్గ్‌ జనవరి నెలలో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. మరోవైపు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఇచ్చిన నివేదికపై జేపీసీ (JPC) ఏర్పాటు చేయాలని కాంగ్రెస సహా ప్రతిపక్ష పార్టీలు కేంద్రాన్ని డిమాండ్‌ చేశాయి. ఈ నివేదిక నేపథ్యంలో అదానీ సంస్థకు చెందిన కంపెనీల షేర్ల విలువ భారీగా పతనమైంది. దీంతో స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ చర్యల్ని బలోపేతం చేసేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో నాలుగు వేర్వేరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, కేంద్రం ప్రతిపాదించిన నిపుణుల కమిటీని తిరస్కరించింది. ఈ మేరకు ఆరు సభ్యులతో కూడిన ఓ కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. ఈ కమిటీ అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై విచారణ జరిపి సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు