
ట్రంప్ పర్యటన కోసం 300 ఏళ్ల తర్వాత..!
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే ప్రత్యేకత కోరుకొంటారు. ఆయన పర్యటిస్తున్నారంటే ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలో ఉండాల్సిందే. చాలా మంది అమెరికా అధ్యక్షులు వచ్చినా జరగనివి ట్రంప్ వచ్చారంటే జరిగిపోతాయి. తాజ్‌మహల్ విషయంలో కూడా అటువంటిదే చోటు చేసుకొంది. దాదాపు 300 సంవత్సరాల తర్వాత అందులోని సమాధుల నమూనాలను శుభ్రపర్చారు. వీటికి క్లేపాక్ ట్రీట్‌మెంట్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆ సమాధులకు ఒకరకమైన మట్టితో చిక్కటి పూతవేసి తర్వాత వాటిని డిస్టిల్ వాటర్‌తో శుభ్రపరిచారు. సాధారణంగా ముఖానికి పూతగా వేసుకొనేందుకు వాడే ఒకరకమైన మట్టిని దీనికి వినియోగించారు.
తాజ్‌మహల్‌కు ఐదుసార్లు..
వాస్తవానికి ఇలాంటి క్లే ట్రీట్‌మెంట్‌నే తాజ్‌మహల్‌కు ఇప్పటి వరకు ఐదుసార్లు నిర్వహించారు. కానీ అప్పట్లో సమాధుల నమూనాలను వదిలేశారు. షాజహాన్, ముంతాజ్‌ల నిజమైన సమాధులు ఈ నమూనాల కింద ఉన్న గదుల్లో భద్రంగా ఉన్నాయి. తాజ్‌మహల్‌లోని నిజమైన సమాధుల వీక్షణకు ఏటా మూడు రోజులు మాత్రమే అనుమతిస్తారు. ఆ సమయంలో చింతపండు కలిపిన నీటితో వీటిని శుభ్రపరుస్తారు. తాజాగా ట్రంప్ పర్యటన సందర్భంగా భారీగా ఏర్పాట్లు చేపట్టారు. వీటిల్లో భాగంగానే తాజ్‌లోని సమాధుల నమూనాలను శుభ్రపర్చారు. ఆగ్రాలో కోతుల సంచారం ఎక్కువగా ఉండటంతో అవి అతిథులకు ఇబ్బందులు సృష్టించకుండా ఐదు కొండముచ్చులను కూడా అధికారులు తీసుకొచ్చారు.
భారత చారిత్రక కట్టడం, ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం సందర్శించారు. తన సతీమణి మెలానియాతో కలిసి తాజ్ అందాలను వీక్షించారు. అక్కడి ప్రఖ్యాత బెంచ్ వద్ద నిల్చుని ఫొటోలకు పోజిచ్చారు. అహ్మదాబాద్ నుంచి నేరుగా ఆగ్రా చేరుకున్న ట్రంప్ దంపతులకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సాదర స్వాగతం పలికారు. స్థానిక గైడ్ ఒకరు వీరికి తాజ్ గొప్పదనాన్ని వివరించారు.