ఫోన్‌లో మాట్లాడుకున్న భారత్‌-చైనా విదేశాంగ మంత్రులు

భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న రెండు రోజుల అనంతరం బుధవారం ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ప్రస్తుత పరిస్థితులపై ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

Updated : 17 Jun 2020 19:07 IST

సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు అంగీకారం?

దిల్లీ: భారత్‌ - చైనా సరిహద్దులో తీవ్ర ఘర్షణ, తదనంతర పరిణామాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్‌లో మాట్లాడారు. భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సరిహద్దు సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. గాల్వన్‌లో హింసాత్మక ఘర్షణలు, జవాన్ల మృతిపై భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ ఈ సందర్భంగా తీవ్ర నిరసన తెలిపారు. గాల్వన్‌లో నిర్మాణాలకు చైనా ప్రయత్నించడమే వివాదాలకు కారణమన్నారు. హింసకు దారి తీసేలా చైనా ప్రణాళిక ప్రకారమే దాడులకు దిగిందనీ.. తద్వారా అన్ని ఒప్పందాలు ఉల్లంఘించిందని అసహనం వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు మార్చాలనే ఉద్దేశం చైనాలో కనబడుతోందన్నారు. జూన్‌ 6న మిలటరీ కమాండర్‌ స్థాయిలో డీఎస్కలేషన్‌ నిర్ణయం జరిగిందన్న జైశంకర్‌.. ఈ మేరకు సైనికులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రోటోకాల్స్‌ తప్పకుండా పాటించాలన్నారు. చైనా అనుసరిస్తున్న ఇలాంటి అనుచితమైన వైఖరి ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. చైనా తన వైపు నుంచి చేపట్టిన కార్యకలాపాలపై పునరాలోచించుకోవాలని సూచించారు. 

మరోవైపు, చైనా తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలను ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ జైశంకర్‌కు వివరించారు. ఈ ఘర్షణలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలనీ.. ఫ్రంట్‌లైన్‌ దళాలను నియంత్రించాలని భారత్‌ను ఆయన కోరినట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ సమస్యను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటామని చైనా విదేశాంగ అధికారప్రతినిధి వెల్లడించిన కొద్దిసేపటికే ఇరువురు నేతల మధ్య ఫోన్‌లో చర్చ జరిగింది. జూన్‌ 6న తీసుకున్న నిర్ణయం ప్రకారమే కట్టుబడి ఉండాలని, దాని ప్రకారం నడుచుకోవాలని ఇరు దేశాల మంత్రులూ తుది నిర్ణయానికి వచ్చారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రొటోకాల్‌ ఒప్పందాల ప్రకారం ఇరు పక్షాలు శాంతి నెలకొల్పేందుకు ఉమ్మడిగా కృషిచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇవీ చదవండి: 

మరిన్ని ఘర్షణలు కోరుకోవడం లేదు:చైనా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని