Vande Bharat Express: ముంబయి - గాంధీనగర్‌ మార్గంలో.. ‘వందేభారత్‌’ సూపర్‌హిట్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెల దాకా దేశంలో ప్రవేశపెట్టిన ఎనిమిది వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలో ముంబయి - గాంధీనగర్‌ మార్గంలోని రైలు అత్యధికంగా దాదాపు 127 శాతం మేర భర్తీ అవుతూ నడుస్తోంది.

Updated : 16 Feb 2023 10:24 IST

సికింద్రాబాద్‌ -విశాఖ రైలు ఆక్యుపెన్సీ 125.7%

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెల దాకా దేశంలో ప్రవేశపెట్టిన ఎనిమిది వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలో ముంబయి - గాంధీనగర్‌ మార్గంలోని రైలు అత్యధికంగా దాదాపు 127 శాతం మేర భర్తీ అవుతూ నడుస్తోంది. బిలాస్‌పుర్‌ - నాగ్‌పుర్‌ రైలు 55 శాతం భర్తీతో చివరిస్థానంలో ఉంది. గంటకు 180 కి.మీ.వేగంతో నడిచే వీటిలో మొత్తం మూడు రైళ్లు తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తుండగా.. మిగతా అయిదూ కిటకిటలాడుతున్నట్లు నివేదిక వెల్లడించింది.

ఫిబ్రవరి పదో తేదీన మరో రెండు రైళ్లను ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో దేశంలో ఈ రైళ్ల సంఖ్య పదికి చేరింది. కొత్త రైళ్ల గణాంకాలను అధికారులు ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు. తక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తున్న రైళ్ల జాబితాలో 70% భర్తీ అవుతున్న న్యూ దిల్లీ - అంబ్‌ అందౌరా, 75% భర్తీ అవుతున్న చెన్నై సెంట్రల్‌ - మైసూర్‌ జంక్షన్‌ రైళ్లు కూడా ఉన్నాయి. మిగతా అయిదు రూట్లలో వంద శాతానికి అటూ ఇటూగా ఈ రైళ్లు నిండుతున్నాయి. ముంబయి - గాంధీనగర్‌ రైలు రికార్డుస్థాయి ఆక్యుపెన్సీతో నడుస్తోంది.

సికింద్రాబాద్‌ - విశాఖపట్నం రూటుతోపాటు న్యూ దిల్లీ - వారణాసి మార్గంలో నడుస్తున్న వందేభారత్‌ రైళ్లు 125.76% ఆక్యుపెన్సీ నమోదు చేస్తున్నాయి. వంద శాతానికి పైగా ఆక్యుపెన్సీ చూపుతున్న రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు ప్రయాణికులను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ గణాంకాలు విడుదల చేశారు. డిసెంబరులో ప్రారంభించినప్పటి నుంచీ తరచూ రాళ్లదాడిని ఎదుర్కొంటున్న హావ్‌డా - న్యూ జల్‌పాయీగుడీ వందేభారత్‌ రైలు రెండు దిశల్లోనూ 104 నుంచి 105 శాతం మేర ఆక్యుపెన్సీ ఉండటం విశేషం. ఈ వందేభారత్‌ రైళ్లు (8) ఇప్పటిదాకా 1,635 ట్రిప్పుల్లో 20 లక్షలకు పైగా ప్రయాణికులను చేరవేసి.. ఈ ఏడాది 100.72 సగటు ఆక్యుపెన్సీ నమోదు చేశాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని