ప్రచారం కోసమే కేజ్రీవాల్‌పై పిటిషన్‌

మద్యం కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ కేవలం ప్రచారాన్ని ఆశించి వేసినట్లు ఉందని, దానికిగానూ కోర్టు ఖర్చు రూపంలో భారీగా వడ్డించాలని దిల్లీ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది.

Updated : 09 Apr 2024 05:52 IST

 సీఎంగా తొలగించాలనడంపై దిల్లీ హైకోర్టు
పిటిషనర్‌కు భారీగా వడ్డించాలని వ్యాఖ్య

దిల్లీ: మద్యం కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ కేవలం ప్రచారాన్ని ఆశించి వేసినట్లు ఉందని, దానికిగానూ కోర్టు ఖర్చు రూపంలో భారీగా వడ్డించాలని దిల్లీ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. ఇదివరకే ఈ అంశంపై రెండు పిటిషన్లను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌ విచారించి, తీర్పు వెలువరించిన తర్వాత ఆప్‌ మాజీ ఎమ్మెల్యే సందీప్‌కుమార్‌ మరో పిటిషన్‌ వేయడంపై జస్టిస్‌ సుబ్రమణ్యం ప్రసాద్‌ ధర్మాసనం అభ్యంతరం వ్యక్తపరిచింది. అదే ధర్మాసనానికి తాజా పిటిషన్‌నూ బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. రాజ్యాంగం నిర్దేశించిన విధుల్ని నిర్వర్తించలేని పరిస్థితిలో సీఎం ఇప్పుడు ఉన్నారని, జైలు నుంచి ఆయన పనిచేయడం సాధ్యం కాదని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఏ అధికారం ప్రకారం ఆయన కొనసాగుతున్నారో ప్రశ్నించి, పదవి నుంచి తప్పించాలని కోరారు. దీనిపై తాత్కాలిక సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరపనుంది.

‘జైల్‌ కా జవాబ్‌ ఓట్‌ సే’ ప్రచారం ప్రారంభం

‘జైల్‌ కా జవాబ్‌ ఓట్‌ సే’ (ఓటుతో జైలుకు సమాధానం చెప్పండి)’ ప్రచారాన్ని ఆప్‌ ప్రారంభించింది. సందీప్‌ పాఠక్‌ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ- పెద్ద కుట్రలో భాగంగా కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేశారన్నారు. ఈ నియంతృత్వ పోకడకు ప్రజలు ఓటుతో సమాధానం చెప్పాలని, ఓటేసే ముందు కేజ్రీవాల్‌ ముఖాన్ని గుర్తుచేసుకోవాలని కోరారు.

కేజ్రీవాల్‌ పీఏ సహా ఇద్దరిని ప్రశ్నించిన ఈడీ

కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బిభవ్‌కుమార్‌, ఆప్‌ ఎమ్మెల్యే దుర్గేశ్‌ పాఠక్‌లకు సోమవారం ఈడీ మరోసారి సమన్లు ఇచ్చి వాంగ్మూలాలు నమోదు చేసుకుంది. మరో ముగ్గురు నేతలు అరెస్టు అవుతారంటూ ఆప్‌ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. దుర్గేశ్‌ పాఠక్‌ వారిలో ఒకరు కావడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆప్‌ పాల్గొనకుండా ఎలాగైనా అడ్డుకోవాలని భాజపా కుట్ర చేస్తోందని ఆతిశీ తాజాగా ఆరోపించారు. మొత్తం నేతలందరినీ జైల్లోకి పంపాలని చూస్తున్నారని ఆప్‌ ఎంపీ సందీప్‌ పాఠక్‌ ఆరోపించారు.


ఆప్‌ ఎంపీ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతలపై చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం దావా ఎదుర్కొంటున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నాయకుడు సంజయ్‌ సింగ్‌కు సుప్రీంకోర్టులో సోమవారం ఊరట లభించలేదు. రాజ్యసభ సభ్యుడైన సింగ్‌ గుజరాత్‌లోని మెట్రోపాలిటన్‌ కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని ధర్మాసనం తేల్చిచెప్పింది. పరువునష్టం కేసులో తమకు జారీచేసిన సమన్లను కొట్టివేయాలంటూ సంజయ్‌ సింగ్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గుజరాత్‌ హైకోర్టుకు వెళ్లారు. వారి అప్పీలును హైకోర్టు ఫిబ్రవరి 16న కొట్టివేసింది. మోదీ విద్యార్హతలను శంకిస్తూ కేజ్రీవాల్‌, సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై మెట్రోపాలిటన్‌ కోర్టులో గుజరాత్‌ విశ్వవిద్యాలయం పరువునష్టం దావా వేయగా ఉభయులకూ సమన్లు జారీ అయ్యాయి. వాటిని కేజ్రీవాల్‌, సింగ్‌లు సెషన్స్‌ కోర్టులో సవాల్‌చేసినా ఊరట లభించలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని