Gujarat: న్యూఇయర్‌ వేళ.. సూర్య నమస్కారాలతో గిన్నిస్‌ రికార్డ్‌

Gujarat: ఈ నూతన సంవత్సరాన్ని గుజరాత్ ప్రభుత్వం సరికొత్తగా ఆహ్వానించింది. ఒకేసారి 108 ప్రాంతాల్లో సామూహిక సూర్యనమస్కారాలు చేసి గిన్నిస్‌ రికార్డ్‌ సాధించింది. 

Updated : 01 Jan 2024 14:55 IST

అహ్మదాబాద్‌: ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే బలం అనే సందేశాన్ని చాటిచెబుతూ గుజరాత్‌ (Gujarat) ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకకాలంలో 108 ప్రాంతాల్లో సామూహిక సూర్య నమస్కారాల (Surya Namaskar) కార్యక్రమం నిర్వహించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ (Guinness Record)లో చోటు దక్కించుకుంది. ప్రసిద్ధ మోధెరా సూర్య దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఈ సూర్య నమస్కారాలు చేశారు.

108 ప్రాంతాల్లో దాదాపు 4 వేల మందికి పైగా ఇందులో పాల్గొన్నారు. విద్యార్థులు, పలు కుటుంబాలు, యోగా ఔత్సాహికులు, వయో వృద్ధులు ఇందులో పాల్గొన్నారు. 51 విభిన్న కేటగిరీల్లో ఈ సూర్యనమస్కారాలను ప్రదర్శించారు. మోధెరా సూర్య దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, హోం మంత్రి హర్ష్‌ సంఘ్వీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్ ప్రతినిధి హాజరై.. గుజరాత్‌ రికార్డ్‌ సాధించినట్లు ప్రకటించారు.

కొత్త ఏడాదికి ఇస్రో ఘన స్వాగతం.. ఎక్స్‌పోశాట్‌ ప్రయోగం విజయవంతం

‘‘అత్యధిక మంది ఒకేసారి సూర్యనమస్కారాలు చేయడంలో ఇదే తొలి రికార్డ్‌. గతంలో ఇప్పటివరకూ ఎవరూ ఇలాంటి రికార్డ్‌కు ప్రయత్నించలేదు. ఈ రికార్డ్‌ను గుజరాత్ సొంతం చేసుకుంది’’ అని గిన్నిస్‌ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘనతపై ప్రధాని మోదీ (PM Modi) హర్షం వ్యక్తం చేశారు.

ఈ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ప్రధాని.. ‘‘ఈ 2024ను గుజరాత్ అరుదైన ఘనతతో స్వాగతించింది. 108 వేదికల్లో ఒకేసారి అత్యధిక మంది సూర్యనమస్కారాలు చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాల్లో 108 సంఖ్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలుసు. యోగా, మన సాంస్కృతిక వారసత్వం పట్ల మన నిబద్ధతకు ఇది నిదర్శనం. ప్రతి ఒక్కరూ రోజువారీ పనుల్లో సూర్యనమస్కారాన్ని భాగం చేసుకోవాలని కోరుతున్నా’’ అని రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని