Updated : 02 Jun 2022 18:29 IST

Sologamy: తనను తాను పెళ్లాడనున్న యువతి.. జూన్‌ 11న ముహూర్తం.. గోవాలో హనీమూన్‌!

గాంధీనగర్: పెళ్లంటే మూడు ముళ్ల బంధమే కాదు.. కష్టసుఖాల్లోనూ కలిసి నడిచే వందేళ్ల ప్రయాణం. కానీ, ఇందుకు భిన్నంగా ఓ యువతి మాత్రం తనను తానే పెళ్లాడనుంది. ఆమే వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమా బిందు. మంత్రాలు, ఏడడుగులు, సింధూర ధారణ వంటి పెళ్లి కార్యక్రమాల మొదలు హనీమూన్‌ వరకు అన్ని ప్లాన్‌ చేసుకోవడం గమనార్హం. జూన్ 11న ఇందుకు ముహూర్తం కుదిరింది. కాగా.. దేశంలోనే ఇది మొదటి స్వీయ వివాహం(సోలోగమీ) కానుంది!

ఓ ప్రైవేటు సంస్థలో పని చేసే క్షమా ఈ విషయమై మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కానీ, పెళ్లికూతురిని కావాలనుకున్నా. కాబట్టి, నన్ను నేనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపింది. ‘దేశంలో ఇలాంటి పెళ్లి ఎక్కడైనా జరిగిందా అని వెతికా. కానీ.. ఏదీ కనిపించలేదు. బహుశా మొదటి వ్యక్తి నేనే కావచ్చు’ అని వెల్లడించింది. ‘కొందరు స్వీయ వివాహాన్ని అసంబద్ధంగా భావించొచ్చు. కానీ, ‘మహిళలూ ముఖ్యమే’ అనే వాస్తవాన్ని చాటి చెప్పేందుకు తాను ప్రయత్నిస్తున్నట్లు వివరించింది.

‘స్వీయ వివాహం అనేది ఓ నిబద్ధత. మన కోసం మనం ఉండాలి.. షరతుల్లేని ప్రేమను ఇచ్చుకోవాలనే దాన్ని ఇది సూచిస్తుంది. మనల్ని మనం అంగీకరిస్తున్నామనే విషయాన్నీ ఇది చాటుతుంది. ఎవరైనా.. తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ నన్ను నేను ప్రేమిస్తున్నా. అందుకే ఈ వివాహం’ అని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తల్లిదండ్రులూ తనను ఆశీర్వదించారని, గోత్రిలోని ఓ ఆలయంలో వివాహ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. పెళ్లి తర్వాత, హనీమూన్‌ కోసం గోవాకు వెళ్తున్నట్లు చెప్పింది.

ఇంతకీ ఎవరీ క్షమా బిందు?

గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు.. తనను తానే పెళ్లాడాలని నిశ్చియించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇందు కోసం ఆమె లెహంగాను సైతం ఆర్డర్‌ చేయడంతో పాటు వెడ్డింగ్ కార్డులను కూడా పంచి పెట్టింది. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన క్షమా.. ప్రస్తుతం ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్‌ రిక్రూట్‌మెంట్‌ అధికారిణిగా పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తండ్రి దక్షిణాఫ్రికాలో ఉంటుండగా.. తల్లి అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. తన కూతురు పరిస్థితిని అర్థం చేసుకోవడానికి వారికి కొంత సమయం పట్టినప్పటికీ చివరకు ఆమె ఇష్టానికి సరేనన్నారు. ఆఖరుకు ఈ వివాహం జరిపించేందుకు పూజారిని కూడా ఒప్పించారు. ఈ నెల 11న స్నేహితుల సమక్షంలో జరిగే క్షమా బిందు పెళ్లిలో వారు వీడియోకాల్‌ ద్వారా పాల్గొననున్నారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని