PM Modi: భారత కళారూపం ఉట్టిపడేలా.. జీ7 నేతలకు మోదీ బహుమతులు

జీ7 కూటమి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న నేతలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అపురూప బహుమతులను అందించారు........

Published : 28 Jun 2022 22:29 IST

దిల్లీ: జీ7 కూటమి శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న నేతలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అపురూప బహుమతులను అందించారు. భారత సంస్కృతి, కళాత్మక సంప్రదాయం ఉట్టిపడేలా తయారు చేసిన పలు శిల్పాలు, కుండలు, ఇతర వస్తువులను ఆయా నేతలకు బహూకరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లో రూపొందించిన గులాబీ మీనాకరితోపాటు కఫ్లింక్‌ సెట్‌ను మోదీ బహుమతిగా అందించారు. వారణాసి GI-ట్యాగ్ ఉన్న కళారూపం, కఫ్‌లింక్ సెట్, బ్రూచ్‌ కూడా ఈ బహుమతుల్లో భాగమయ్యాయి. మొరాదాబాద్‌లో తయారయ్యే అద్భుత కళాఖండంగా పేరుపొందిన మెటల్ మరోడినితోపాటు కార్వింగ్ మట్కాను జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్‌ సోల్జ్‌ అందుకున్నట్లు అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి.

ఉత్తరప్రదేశ్‌లోని నిజామాబాద్‌లో తయారైన నల్ల కుండలను జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదాకు మోదీ బహుమతిగా అందించారు. చేతితో (హ్యాండ్‌ మేడ్‌) చేసిన ప్లాటినం పెయింట్ టీ సెట్‌ను బ్రిటన్ ప్రధానికి బోరిస్‌ జాన్సన్‌కు బహుమతిగా ఇచ్చారు. లఖ్‌నవూలో రూపొందించిన జర్దోజీ పెట్టెలోని ఇత్తర్ (సహజ మూలాల నుండి తయారు చేసిన పరిమళం) సీసాలను ఫ్రాన్స్‌ అధ్యక్షుడికి, పాలరాతితో రూపొందించిన కళాఖండం, టేబుల్ టాప్‌ను ఇటలీ ప్రధానమంత్రికి బహుమతిగా ఇచ్చారు.

సెనెగల్‌లో చేతితో నేసే సంప్రదాయం తల్లి నుండి కూతురికి సంక్రమించే విధానం ఉట్టిపడేలా.. ఆ దేశాధ్యక్షుడికి మూన్జ్ బుట్టలు, కాటన్ దుపట్టాలను మోదీ ఎంచుకున్నారని వర్గాలు తెలిపాయి. ఈ ఉత్పత్తులు యూపీలోని ప్రయాగ్‌రాజ్, సుల్తాన్‌పూర్ అమేఠీల్లో అధికంగా తయారు చేస్తారని పేర్కొన్నారు. ఇండోనేషియా సంస్కృతిలో భాగమైన రామాయణ సంప్రదాయం ప్రతిబించించేలా ఆ దేశ అధ్యక్షుడికి ‘రామ దర్బార్’ను బహుమతిగా ఇచ్చారు. ఇది వారణాసిలో తయారైనట్లుగా ట్యాగ్‌ తెలియజేస్తోంది.

కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు కశ్మీర్‌లో ప్రసిద్ధిగాంచిన పట్టు తివాచీని బహుమతిగా ఇచ్చారు. రామాయణం, నంది ఇతివృత్తాలతో కూడిన డోక్రా కళాఖండాలను దక్షిణాఫ్రికా, అర్జెంటీనా అధ్యక్షులకు బహుమతులుగా అందించారు. కాగా ఈ కళాఖండాలు ఛత్తీస్‌గఢ్‌లో తయారయ్యాయి. భారతదేశంలో డోక్రా ఆర్ట్ 4000ఏళ్ల క్రితం నుంచే మనుగడలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు