Bombay HC: ఔషధాల కొరతతో మరణాలా..? ఆసుపత్రుల్లో మృత్యుఘోషపై బాంబే హైకోర్టు సీరియస్‌

మహారాష్ట్ర ఆసుపత్రుల్లో మృత్యుఘోషను బాంబే హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. గంటల వ్యవధిలో పదుల సంఖ్యలో రోగులు మరణించిన ఘటనను సుమోటోగా స్వీకరించింది.

Published : 04 Oct 2023 18:57 IST

ముంబయి: మహారాష్ట్ర ఆసుపత్రుల్లో మృత్యుఘోషను బాంబే హైకోర్టు (Bombay HC) తీవ్రంగా పరిగణించింది. నాందేడ్‌తోపాటు ఛత్రపతి శంభాజీనగర్‌ ఆసుపత్రుల్లో వరుసగా రోగులు మృత్యువాతపడటాన్ని సుమోటోగా స్వీకరించింది. చీఫ్‌ జస్టిస్‌ డీకే ఉపాధ్యాయ, జస్టిస్‌ ఆరిఫ్‌ ఎస్‌ డాక్టర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌.. బడ్జెట్‌లో ఆరోగ్యానికి ప్రభుత్వం ఎంత కేటాయించింది? పెట్టిన ఖర్చు..? తదితర వివరాలు తెలపాలని అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది.

గత మూడు రోజులుగా మహారాష్ట్రలోని ప్రభుత్వాసుపత్రుల్లో మృత్యు ఘోష వినిపిస్తోంది. నాందేడ్‌ ఆసుపత్రిలో 31 మంది, ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఆసుపత్రిలో 18 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. గంటల వ్యవధిలో పదుల సంఖ్యలో రోగులు మృత్యువాతపడటం రాష్ట్రాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ వ్యవహారంపై మోహిత్‌ ఖన్నా అనే న్యాయవాది బాంబే హైకోర్టుకు లేఖ రాశారు. దానిని పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. ఓ పిటిషన్‌ దాఖలు చేయాలని, తద్వారా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పింది. ఆసుపత్రుల్లో ఖాళీలు, ఔషధాల లభ్యత, ప్రభుత్వం ఖర్చుచేస్తున్న నిధులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని సూచించింది.

హనీమూన్‌’ ముగియక ముందే.. మహా ప్రభుత్వంలో ముసలం?

అనంతరం మధ్యాహ్నం (బుధవారం) సెషన్‌లో ఇదే అంశాన్ని ప్రస్తావించిన బాంబే హైకోర్టు.. ఈ ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఆసుపత్రి పడకలు, సిబ్బంది, అత్యవసర ఔషధాల కొరత ఉన్నట్లు వైద్యులు చెప్పడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై శుక్రవారం విచారణ జరుపుతామని.. ఆలోపు వివరాలన్నీ తమ ముందు ఉంచాలని ఆదేశించింది.

మరోవైపు ఆసుపత్రుల్లో వరుస మరణాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఇప్పటికే ప్రకటించారు. అయితే, అసుపత్రుల్లో సిబ్బంది, ఔషధాల కొరత ఉందని వస్తోన్న వార్తలను ఆయన తోసిబుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు