
India Corona: కొత్త కేసులు 3 లక్షలుదాటేశాయి.. పండగ ఎఫెక్ట్ మొదలైందా..?
దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరింత తీవ్రరూపం దాల్చింది. దాంతో కొత్త కేసులు భారీగా పెరిగి, మూడు లక్షల మార్కును దాటేశాయి. తాజాగా 19 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,17,532 మంది వైరస్ బారినపడ్డారు. ముందురోజు కంటే 12శాతం అధికంగా కొత్త కేసులు వెలుగుచూశాయి. పాజిటివిటీ రేటు 15శాతం నుంచి 16.41 శాతానికి పెరిగి ఆందోళన కలిగిస్తోంది. మరోపక్క మరణాలు కూడా ఎక్కువగానే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 491 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 3.82 కోట్ల మందికి కరోనా సోకగా.. 4,87,693 మంది మహమ్మారికి బలయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజా ఉద్ధృతికి దోహదం చేస్తోంది. ప్రస్తుతం ఆ వేరియంట్ కేసులు 9,287కి చేరాయి. కొద్ది వారాలుగా వైరస్ విజృంభిస్తుండటంతో క్రియాశీల కేసులు 19 లక్షలు దాటాయి. క్రియాశీల రేటు 5.03 శాతానికి పెరిగిపోయింది. నిన్న 2,23,990 మంది కోలుకున్నారు. కొవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరటనిస్తోంది. మొత్తం రికవరీలు 3.58 కోట్లు(93.69 శాతం)గా ఉన్నాయి.
160 కోట్లకు చేరువగా డోసుల పంపిణీ..
దేశంలో టీకా కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. ఇప్పటివరకు 159 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 73.3లక్షల మంది టీకా తీసుకున్నారు. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారిలో 3.84 కోట్ల మందికి తొలి డోసు పూర్తయ్యింది. ఆ వయసు వారిలో 50 శాతం మందికి పైగా మొదటి డోసు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే 61,75,049 ప్రికాషనరీ డోసులు వేసినట్లు వెల్లడించింది.