India-Maldives: బలగాల ఉపసంహరణపై.. భారత్‌-మాల్దీవుల కోర్‌ కమిటీ భేటీ

India-Maldives: సైనిక బలగాల ఉపసంహరణపై భారత్‌, మాల్దీవుల మధ్య రెండోసారి కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. పరస్పరం ప్రయోజనం చేకూర్చే పరిష్కారం కోసం ఇందులో చర్చించారు.

Published : 02 Feb 2024 19:28 IST

దిల్లీ: భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన విభేదాలు(India maldives conflict) నెలకొన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. మాల్దీవుల్లో ఉన్న భారత సైనిక బలగాల ఉపసంహరణ అంశంపై శుక్రవారం కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. దిల్లీ వేదికగా ఇరు దేశాల ఉన్నతస్థాయి అధికారులు ఇందులో పాల్గొన్నారు.

చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మహ్మద్‌ ముయిజ్జు (Mohamed Muizzu) అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య దూరం పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మార్చి 15 నాటికి తమ భూభాగం నుంచి భారత దళాలు వైదొలగాలని మాల్దీవుల అధ్యక్షుడు ఇటీవల గడువు విధించారు. గతేడాది డిసెంబరులో భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీ సందర్భంగానూ ముయిజ్జు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సమస్య పరిష్కారానికి కోర్‌ గ్రూప్‌ ఏర్పాటుచేయాలని ఇరువురూ నిర్ణయించారు.

మాల్దీవులకు ఆర్థిక సాయం చేస్తాం.. పాక్‌ ప్రధాని హామీ

ఈ క్ర్రమంలోనే రెండు వారాల క్రితం ఈ కమిటీ మాలెలో భేటీ అయ్యింది. తాజాగా దిల్లీలో మరోసారి సమావేశం నిర్వహించింది. ఈ అంశంలో పరస్పర ప్రయోజనం చేకూర్చే పరిష్కారాన్ని కనుగొనడంపై ఇరు దేశాలు దృష్టి సారించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

భారత్‌కు చెందిన దాదాపు 80 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం అక్కడ ఉంటోంది. భారత్‌ సహకారంతో ఏర్పాటుచేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్‌లో గస్తీకి సహకరిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని