Myanmar: 184 మంది మయన్మార్‌ సైనికులను వెనక్కి పంపిన భారత్‌

184 మంది మయన్మార్‌ సైనికులను భారత్‌ వెనక్కి పంపించింది. అక్కడి రెబల్స్‌ దాడుల దెబ్బకు వీరు మిజోరంలోకి చొరబడి తలదాచుకున్నారు.

Updated : 23 Jan 2024 12:17 IST

ఇంటర్నెట్‌డెస్క్: అంతర్యుద్ధం కారణంగా అట్టుడుకుతున్న మయన్మార్‌ నుంచి భారీగా సైనికులు భారత్‌లోకి చొరబడుతున్నారు. కొన్నాళ్ల క్రితం మిజోరంలోకి ప్రవేశించిన 184 మంది సైనికులను సోమవారం భారత్‌ వెనక్కి పంపింది. ఈ విషయాన్ని అస్సాం రైఫిల్స్‌ వెల్లడించింది. మరో 92 మందిని నేడు మయన్మార్‌కు పంపిస్తామని తెలిపింది.

గత వారం అరాకన్‌ ఆర్మీ సాయుధులు మయన్మార్‌ సైనిక క్యాంప్‌పై దాడి చేశారు. దీంతో మొత్తం 276 మంది అక్కడి సైనికులు భారత్‌లో చొరబడ్డారు. ఇందుకోసం వారు భారత్‌-మయన్మార్‌-బంగ్లాదేశ్‌ కూడలిలోని బందూక్‌బంగా గ్రామాన్ని వాడుకున్నారు. ఇది దక్షిణ మిజోరంలో ఉంది. వీరి వద్ద ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా ఉన్నాయి. వీరు నేరుగా పర్వాలోని అస్సాం రైఫిల్స్‌ క్యాంప్‌లో లొంగిపోయారు.

నాటి నుంచి అస్సాం రైఫిల్స్‌ వారి బాగోగులు చూసుకుంటోంది. వీరిని శనివారం ఆయిజోల్‌కు తరలించారు. అక్కడి లెంగ్‌పుయ్‌ ఎయిర్‌ పోర్టు నుంచి మయన్మార్‌కు పంపించారు. ఈ గ్రూపులో కర్నల్‌, 36 మంది ఆఫీసర్లు, 240 మంది జవాన్లు ఉన్నారు.

2021 నుంచి మయన్మార్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ప్రజా ప్రభుత్వాన్ని సైన్యం కూలదోయడంతో అంతర్యుద్ధానికి బీజం పడింది.  ‘త్రీబ్రదర్‌హుడ్‌ అలయన్స్‌’ భారీ ఎత్తున సైన్యంపై దాడులు మొదలుపెట్టింది. ఇందులో మయన్మార్‌ జాతీయ ప్రజాస్వామ్య కూటమి సైన్యం (ఎంఎన్‌డీఏఏ), టాంగ్‌ జాతీయ విమోచన సైన్యం(టీఎన్‌ఎల్‌ఏ), అరాకన్‌ ఆర్మీ(ఏఏ) భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. దేశంలో అత్యంత శక్తిమంతమైన సాయుధ తిరుగుబాటు సంస్థలుగా వీటికి పేరుంది. ఇవి కీలక పట్టణాలను స్వాధీనం చేసుకొని సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నాయి. వీరి దాడులు తట్టుకోలేక వందల మంది సైనికులు భారత్‌లోకి చొరబడుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని