Aditya-L1: ఇస్రో మరో ఘనత.. లగ్రాంజ్‌ పాయింట్‌కు ఆదిత్య-ఎల్‌1: మోదీ ట్వీట్‌

Aditya-L1: ఇస్రో మరో ఘనత సాధించింది. ‘ఆదిత్య-ఎల్‌1’ వ్యోమనౌకను శనివారం లగ్రాంజ్‌ పాయింట్‌1 కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

Updated : 06 Jan 2024 17:23 IST

బెంగళూరు: సూర్యుడి (Sun)ని అధ్యయనం చేసేందుకు నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య-ఎల్‌1 (Aditya-L1) తన గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరుకుంది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను తుది కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శనివారం చేపట్టిన కీలక విన్యాసం ఫలించింది. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్‌ పాయింట్‌ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి దీన్ని పంపించారు. ఇక్కడి నుంచి ఇది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రధాని మోదీ ఎక్స్‌లో వెల్లడించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

‘‘భారత్‌ మరో అరుదైన ఘనత సాధించింది. దేశ తొలి సోలార్‌ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్‌1 తన గమ్యస్థానాన్ని చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ అద్భుత విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు. మానవాళి ప్రయోజనాల కోసం శాస్త్రసాంకేతిక రంగంలో కొత్త శిఖరాలకు చేరుకునే మన ప్రయాణం కొనసాగుతుంది’’ అని మోదీ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

రాష్ట్రపతి ప్రశంసలు..

ఆదిత్య-ఎల్‌1 విజయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇస్రో మరో ఘన విజయం అందుకుంది. ఈ ఘనత సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు. ఈ మిషన్‌తో మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. సూర్యుడు-భూమి వ్యవస్థలపై మన జ్ఞానాన్ని మరింత మెరుపరుస్తుంది. ఇస్రో మిషన్లలో మహిళా శాస్త్రవేత్తలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు. ఇది మహిళా సాధికారితను మరింత ఉన్నత కక్ష్యలోకి తీసుకెళ్తుంది’’ అని రాష్ట్రపతి కొనియాడారు.

అటు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్‌ స్పందిస్తూ.. ‘‘మూన్‌ వాక్‌ నుంచి సన్‌ డ్యాన్స్‌ వరకు..! ఆదిత్య-ఎల్‌1 తుది కక్ష్యలోకి చేరుకుంది. ఇస్రోకు అభినందనలు’’ అని ఆయన ప్రశంసించారు.

సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ‘ఆదిత్య-ఎల్‌1’ లక్ష్యం. భారత్‌ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్‌ ఇదే. గతేడాది సెప్టెంబరు 2న శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్‌ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని