కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదికి.. లష్కరేతో సంబంధాలు..?

కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌ దల్లాకు లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధాలున్నట్లు దిల్లీ పోలీసులు గుర్తించారట. ఈ మేరకు వారు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Updated : 25 Sep 2023 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖలిస్థానీ అంశంతో భారత్, కెనడా (India Canada Diplomatic Row) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌ దల్లాకు లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో ఉన్న హిందూ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపాలని అర్ష్‌దీప్‌ కుట్రలు పన్నుతున్నాడని దిల్లీ పోలీసులు (Delhi Police) గుర్తించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల కోసం దిల్లీ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో దిల్లీలోని జహంగిర్‌పురిలో ఆయుధాలు లభ్యమయ్యాయి. అనంతరం తనిఖీలు చేపట్టిన పోలీసులు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారిని విచారించిన పోలీసులు ఇటీవల కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

ఈ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయని పోలీసులు ఆ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు సదరు మీడియా కథనాలు వెల్లడించాయి. అరెస్టయిన అనుమానిత ఉగ్రవాదుల్లో ఒకడు.. తాను అర్ష్‌దీప్‌ దల్లాతో టచ్‌లో ఉన్నట్లు అంగీకరించాడట. పంజాబ్‌లో ఉగ్ర కార్యకలాపాలకు సిద్ధమవ్వాలని దల్లా.. తనకు సూచించాడని విచారణలో చెప్పినట్లు పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 

‘ఆరోపణలు నిజమని తేలితే..’: భారత్‌తో ఉద్రిక్తతల వేళ కెనడా మంత్రి కీలక వ్యాఖ్యలు

లష్కరే ముఠాకు చెందిన సుహైల్‌ అనే ఉగ్రవాదితో అర్ష్‌దీప్‌ దల్లాకు సన్నిహిత సంబంధాలున్నాయని ఈ దర్యాప్తులో దిల్లీ పోలీసులు గుర్తించారు. సుహైల్‌, దల్లా ఆదేశాల మేరకే.. దిల్లీలో తాను ఓ హిందూ బాలుడిని హత్య చేసినట్లు సదరు అనుమానిత ఉగ్రవాది పోలీసుల ముందు అంగీకరించాడని సమాచారం. పంజాబ్‌లో కల్లోలం సృష్టించేందుకు తమకు సుహైల్‌, దల్లా నుంచి ఆయుధాలు అందుతున్నాయని అతడు చెప్పినట్లు పోలీసులు తమ ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు.

ఎవరీ అర్ష్‌దీప్‌ దల్లా?

27 ఏళ్ల దల్లా స్వస్థలం పంజాబ్‌లోని మోఘా జిల్లా. భారత్‌లో అతడిపై కనీసం 25 కేసులున్నాయి. 2020 జులైలో అతడు కెనడా పారిపోయినట్లు నిఘా వర్గాల సమాచారం. కెనడాలో ఉంటున్న ఖలిస్థానీ మద్దతుదారుల్లో దల్లా కూడా ఒకడని భారత నిఘా వర్గాలు ధ్రువీకరించాయి. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌కు ఇతడు సన్నిహితుడని తెలుస్తోంది. అయితే నిజ్జర్‌ కంటే కూడా దల్లాపైనే ఎక్కువ క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు సమాచారం. ఇక, దల్లా గ్యాంగ్‌కు చెందిన మరో గ్యాంగ్‌స్టర్‌ సుఖ్‌దోల్‌ సింగ్‌ గతవారం కెనడాలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని