డ్రగ్స్ కేసులో ఆరోపణలు.. మాజీ సీఎంపై స్టాలిన్ పరువు నష్టం దావా

మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిపై సీఎం స్టాలిన్(MK Stalin) పరువు నష్టం దావా వేశారు. 

Published : 14 Mar 2024 16:13 IST

చెన్నై: ఇటీవల భారీ మాదక ద్రవ్యాల రాకెట్‌ (Drug racket) బయటపడిన సంగతి తెలిసిందే. దీనిలో సినీ నిర్మాత, డీఎంకే బహిష్కృత నేత జాఫర్ సాదిక్ పేరు వెలుగులోకి రావడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై అన్నాడీఎంకే, భాజపా నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ కేసులో తనకు సంబంధాలున్నాయంటూ విపక్ష పార్టీలు చేస్తోన్న ఆరోపణలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) తీవ్రంగా స్పందించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై పరువునష్టం దావా వేశారు.

రాజకీయ శత్రుత్వంతో, ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆరోపణలు చేశారంటూ ఆ దావాలో పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం దిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌ ద్వారా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించిన సంగతి తెలిసిందే. ఈ నెట్‌వర్క్‌ భారత్‌ సహా మలేషియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన నిర్మాత జాఫర్‌ సాదిక్‌ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.

డ్రగ్స్‌ రవాణా కేసులో సినీ నిర్మాత అరెస్టు

సాధిక్‌.. డీఎంకే పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగానికి చెందిన ఆఫీస్‌ బేరర్‌. ఇటీవల బయటపడిన భారీ డ్రగ్‌ రాకెట్‌లో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు గుర్తించారు. అతడు క్రమశిక్షణను ఉల్లంఘించి చెడ్డపేరు తీసుకొచ్చినట్లు డీఎంకే పేర్కొంది. జాఫర్‌ను ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎన్‌ఆర్‌ఐ విభాగం పదవి నుంచి తొలగించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని