Modi: కాంగ్రెస్‌పై విమర్శల వేళ.. శశిథరూర్‌కు ప్రధాని కృతజ్ఞతలు..

పార్లమెంట్‌ వేదికగా కాంగ్రెస్‌ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రధాని మోదీ (Modi).. మధ్యలో విపక్ష పార్టీ నేత శశి థరూర్‌ (Shashi Tharoor)కు కృతజ్ఞతలు తెలిపారు. లోక్‌సభలో ప్రధాని వాడీవేడీగా ప్రసంగిస్తున్న సమయంలో ఈ సన్నివేశం జరిగింది.

Published : 09 Feb 2023 14:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పార్లమెంట్‌లో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది.  తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు నిన్న గట్టిగా బదులిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi).. యూపీయే పాలనపై దుమ్మెత్తిపోశారు. ఆ సమయంలో మధ్యలో ఓసారి తన ప్రసంగాన్ని ఆపి మరీ.. కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌ (Shashi Tharoor)కు ధన్యవాదాలు తెలిపారు. ఇంతకీ థరూర్‌కు ప్రధాని ఎందుకు కృతజ్ఞతలు చెప్పారంటే..?

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ (Modi) బుధవారం లోక్‌సభలో సమాధానమిచ్చారు. అయితే, ఈ ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకునేందుకు యత్నించాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్ష పార్టీ సభ్యులు డిమాండ్‌ చేశారు. అయితే, స్పీకర్‌ వారిని వారించడంతో కాంగ్రెస్‌ (Congress) సహా కొంతమంది విపక్ష ఎంపీలు మోదీ ప్రసంగిస్తుండగానే సభ నుంచి వాకౌట్‌ చేశారు.

ఆ తర్వాత కాసేపటికి కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ సభకు తిరిగొచ్చారు. ఆయనను గుర్తించిన ప్రధాని (Modi).. తన ప్రసంగాన్ని ఆపి ‘థాంక్యూ శశీజీ’ అని అన్నారు. థరూర్‌ వచ్చిన కాసేపటికి మరింతమంది విపక్ష సభ్యులు కూడా సభకు తిరిగొచ్చారు. అయితే, థరూర్‌కు మోదీ కృతజ్ఞతలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని ఆ మాట అనగానే.. ‘‘కాంగ్రెస్‌ (Congress) చీలిపోయింది’’ అంటూ భాజపా ఎంపీలు నినాదాలు చేశారు. దీనికి మోదీ చిరునవ్వులు చిందించారు.

ఇదిలా ఉండగా.. లోక్‌సభలో ప్రధాని ప్రసంగంపై ఆ తర్వాత థరూర్‌ (Shashi Tharoor) కూడా స్పందించారు. ‘‘ప్రధాని చాలా మంచి ప్రసంగం చేశారు. కానీ, ప్రతిపక్షాలు అడిగిన ఏ ప్రశ్నకూ ఆయన సమాధానం చెప్పలేకపోయారు. మరోవైపు.. యూపీఏ హయంలో జరిగిన ఉగ్రదాడి ఘటనలకు కాంగ్రెస్‌ను బాధ్యులుగా చూపిస్తూ విమర్శలు చేయడం సముచితం కాదు. అవి ఏ పార్టీని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఉగ్రదాడులు కాదు. భారత్‌పై జరిగిన దాడులు. పుల్వామా, ఉరి, పఠాన్‌కోట్‌ వంటి ఘటనలను మేం రాజకీయం చేయలేదే..! మోదీజీ.. భారత్‌ కోసం మాట్లాడండి’’ అంటూ ప్రధాని విమర్శలను థరూర్‌ తిప్పికొట్టారు.

అదానీ వ్యవహారంలో తనపై విపక్షాలు చేసిన విమర్శలపై ప్రధాని మోదీ ఎదురుదాడి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా 2004-14 మధ్య యూపీయే పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారి హయాంలో ఉగ్రదాడుల పరంపర కొనసాగిందని దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని