
Modi: యువ భారత్ దారి చూపుతోంది: మోదీ
దిల్లీ: కరోనా కట్టడిలో భాగంగా 15-18 ఏళ్ల వయసు వారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యాక్సినేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా దేశంలో ఆ వయసు గ్రూప్‌లో 50 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఎంతో ప్రోత్సాహకరమైన వార్త అని అన్నారు.
‘‘యువ భారత్ వ్యాక్సినేషన్‌లో ఓ దారిని చూపిస్తోంది. ఇది ఎంతో ప్రోత్సాహకరమైన వార్త. దీన్ని ఇలాగే కొనసాగించాలి. అందరూ వ్యాక్సిన్ వేసుకొని, కొవిడ్ నిబంధనలను పాటించడం చాలా ముఖ్యం. మనమంతా ఏకమై ఈ మహమ్మారిపై యుద్ధం చేయాలి’’ అని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ధైర్యం స్ఫూర్తిదాయకం
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఆర్‌ఎఫ్) రైజింగ్ డే సందర్భంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. వారి ధైర్యసాహసాలు, వృత్తిపై చూపే అంకితభావం స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. విపత్తు నిర్వహణ అనేది ప్రభుత్వానికి, పాలకులకు ఎంతో ముఖ్యమైన అంశమని చెప్పారు. అందుకే, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తద్వారా విపత్తు సమయాల్లో వీలైనన్ని ఎక్కువ ప్రాణాలను, ఆస్తులను కాపాడగలమని మోదీ చెప్పారు.
స్ఫూర్తినింపే జీవతగాథలను మాకు చెప్పండి..
ప్రధాని మోదీ ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలనుద్దేశించి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రసంగిస్తారనే విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఈ నెల 30న జరగబోతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఈ కార్యక్రమంలో భాగం కావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రజలు వారికి తెలిసిన స్ఫూర్తిదాయక జీవితగాథలను తనకు తెలియజేయాలని కోరారు.
‘‘2022లో మొదటి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఈ నెల 30న జరగనుంది. నాతో పంచుకోవడానికి మీ వద్ద ఎన్నో స్ఫూర్తిదాయకమైన జీవిత కథలు, అంశాలు ఉన్నాయని భావిస్తున్నాను. వాటిని మీరు @mygovindia లేదా NaMo యాప్ ద్వారా పంచుకోండి. 1800-11-7800 నంబర్‌కి కాల్ చేసి కూడా మీ సందేశాన్ని రికార్డ్ చేయొచ్చు" అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.