Delhi: గర్భం దాల్చిన మైనర్‌ బాలిక.. ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించిన తల్లి!

గర్భం దాల్చిన ఓ మైనర్‌ బాలికకు ఆశ్రయం ఇవ్వడానికి ఆమె తల్లి నిరాకరించింది. కోర్టు ఆదేశాలతో బాలికను పోలీసులు ఓ ఆశ్రయ కేంద్రానికి తరలించారు. 

Updated : 07 Nov 2023 19:10 IST

దిల్లీ: దిల్లీకి (Delhi) చెందిన ఓ మైనర్‌ బాలిక కొద్ది రోజుల క్రితం ప్రియుడితో వెళ్లిపోయింది. తనను వెతికి తీసుకురావాలంటూ ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ వ్యవహారం దిల్లీ హైకోర్టు దాకా వెళ్లింది. పోలీసులు ఎట్టకేలకు ఆమె జాడ కనిపెట్టారు. అయితే, బాలిక గర్భవతి అని తెలియడంతో ఇంట్లో ఆశ్రయం ఇవ్వడానికి ఆమె తల్లి నిరాకరించింది. దాంతో కోర్టు జోక్యం చేసుకొని బాలికను హరినగర్‌లోని ‘నిర్మల్‌ ఛాయ’ ఆశ్రయ కేంద్రానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. 

జర్నలిస్టుల వస్తువులను సీజ్‌ చేయడం తీవ్రమైన అంశం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కొద్ది రోజు క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి హైకోర్టులో ఓ పిటిషన్‌ వేసింది. అధికారులు బాలిక జాడ కనుగొనేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఆమె సెప్టెంబరు నుంచి కనిపించడం లేదని, ఓ బాలుడితో కలిసి వెళ్లిపోయినట్లు అనుమానంగా ఉందని ఆ సందర్భంలో పేర్కొంది. ఆ బాలుడు తమ పొరుగునే నివాసం ఉండేవాడని పిటిషనర్‌ వివరించింది. వారిద్దరూ చనువుగా ఉన్నారని, అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపింది. ఆ ఆధారాలను పరిగణనలోకి తీసుకొని పోలీసులు సెప్టెంబరు నెలలో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నవంబరు 3న బాలిక ఆచూకీ దొరికిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆమె వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్‌ ఎదుట నమోదు చేశామని వివరించారు. బెంచ్‌ విచారణ సందర్భంగా బాలిక తాను ఆరువారాల గర్భవతిని అన్న విషయం వెల్లడించింది. తనకు తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని ఉందని చెప్పింది. 

ఈ పరిణామంతో బాలిక తల్లిదండ్రులు నివ్వెరపోయారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లే ఉద్దేశం తమకు లేదని కోర్టుకు తెలిపారు. దాంతో కోర్టు స్పందిస్తూ బాలిక జాడను పోలీసులు కనుగొనడం పట్ల తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నట్లు భావిస్తున్నామని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రుల తిరస్కరణను పరిగణనలోకి తీసుకొని బాలికను నిర్మల్ ఛాయకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు