Maharashtra Crisis: ఏక్‌నాథ్‌ గూటికి మరో మంత్రి.. అస్సాం క్యాంపులో 9కి చేరిన మంత్రులు

శిందే క్యాంపులో 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లోనే ఇస్తున్నారని ఉద్ధవ్‌ ఠాక్రే చెబుతోన్న సమయంలోనే మరో మంత్రి అస్సాం వెళ్లి ఏక్‌నాథ్‌ క్యాంపులో చేరిపోయారు.

Published : 27 Jun 2022 01:25 IST

శివసేనలో కొనసాగుతోన్న ఆధిపత్య పోరు

ముంబయి: గడిచిన ఐదు రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Politics) అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే (Uddhav Thackeray), శివసేన అసమ్మతి నేత ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) క్యాంపు మధ్య ఆధిపత్య పోరు మరింత తీవ్రమైనట్లు కనిపిస్తోంది. శిందే క్యాంపులో 20 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లోనే ఉన్నారని ఉద్ధవ్‌ ఠాక్రే చెబుతోన్న సమయంలోనే మరో మంత్రి అస్సాం వెళ్లి ఏక్‌నాథ్‌ క్యాంపులో చేరిపోయారు. రెబల్‌ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోన్న వేళ తాజా పరిణామం ఉద్ధవ్‌ ఠాక్రేకు మరింత ఇబ్బందిగా మారినట్లు కనిపిస్తోంది.

రెబల్‌ నేతలు ఏక్‌నాథ్‌ శిందే, గులాబ్‌రావ్‌ పాటిల్‌, దాదా భుసేలను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు ఉద్ధవ్‌ఠాక్రే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు మరో ఇద్దరు సహాయ మంత్రులను కూడా తొలగించేందుకు ఠాక్రే సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో అస్సాంకు చేరుకున్న మంత్రి ఉదయ్‌ సామంత్‌.. అసమ్మతి ఎమ్మెల్యేలతో కలిసిపోయారు. దీంతో శిందే క్యాంపులో చేరిన మంత్రుల సంఖ్య తొమ్మిదికి చేరినట్లు సమాచారం.

మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోన్న వేళ.. శిందే క్యాంపు ఏ పార్టీలో వీలినం కావాలనే అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భాజపాలో విలీనం కావడం ఒక అంశమైతే.. ప్రహార్‌ జనశక్తి పార్టీతోనూ కలిసిపోయేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేత బాచ్చు ఖదు శిందే క్యాంపులోనే ఉన్నారు. మరోవైపు అసమ్మతి నేతలు సోమవారం నాడు ముంబయికి తిరిగి వస్తారనే వర్తలు వినిపిస్తున్నాయి.

రెబల్‌ నేతలకు భద్రత కల్పించండి..

శివసేన అసమ్మతి ఎమ్మెల్యేల కార్యాలయాలపై ఉద్ధవ్‌ ఠాక్రే మద్దతుదారులు దాడులు, బెదిరింపులకు పాల్పడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెబల్‌ ఎమ్మెల్యేల కుటుంబాలకు పూర్తి భద్రత కల్పించాలని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. తమ పోలీసు భద్రతను ఉపసంహరించుకున్నట్లు 47 మంది ఎమ్మెల్యేలు (38 మంది శివసేన, ఇద్దరు ప్రహార్‌ జన్‌శక్తి పార్టీ, మరో ఏడుగురు స్వతంత్రులు) తన దృష్టికి తీసుకువచ్చారని గవర్నర్‌ పేర్కొన్నారు. దీంతో రెబల్‌ ఎమ్మెల్యేలు ఇళ్లు, కార్యాలయాల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని డీజీపీకి సూచించారు. ఇప్పటికే 15 మంది శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు సీఆర్‌పీఎఫ్‌ భద్రతను కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని