Parliament: ప్రతిపక్షం, ప్రభుత్వం రెండూ నాకు కళ్లులాంటివి: ఉపరాష్ట్రపతి

ప్రతిపక్షం, ప్రభుత్వం.. రెండూ తనకు కళ్లులాంటివని రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇరుపక్షాలు సమష్టి బాధ్యతతో వ్యవహరిస్తేనే ......

Published : 13 Aug 2021 20:05 IST

దిల్లీ:  ప్రతిపక్షం, ప్రభుత్వం.. రెండూ తనకు కళ్లులాంటివని రాజ్యసభ ఛైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇరుపక్షాలు సమష్టి బాధ్యతతో వ్యవహరిస్తేనే పార్లమెంట్‌ ఉభయ సభలు సజావుగా జరుగుతాయని పునరుద్ఘాటించారు. రాజ్యసభలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో విలేకర్లతో మాట్లాడిన అంశాలపై ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అధికార, విపక్ష పార్టీల పరస్పర మొండి వైఖరితో ఉభయ సభలూ వాయిదాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పెగాసస్‌, వివాదాస్పద వ్యవసాయ చట్టాలు, తదితర అంశాలపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో పాటు నిరసన ప్రదర్శనలతో ఉభయ సభల్ని స్తంభింపజేసిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రతిపక్షం, అధికార పక్షం రెండూ తనకు సమానమేనన్నారు. రెండు కళ్లతోనే సరైన దృష్టి కుదురుతుందని, ఇరుపక్షాలను తాను సమానంగా గౌరవిస్తానన్నారు. పార్లమెంట్‌ ఉభయ సభలూ సజావుగా సాగాలంటే సమష్టి బాధ్యతతో వ్యవహరిస్తేనే సాధ్యమవుతుందని గతంలో అనేక సందర్భాల్లో తాను చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తుచేశారు.  సభా కార్యకలాపాలకు విపక్ష సభ్యులు అడ్డుతగలడంపై స్పందిస్తూ.. చట్టసభలు చర్చలకోసం ఉద్దేశించబడినవే తప్ప బయటి రాజకీయ పోరాటాలను సభలోకి తీసుకురావడం సరికాదన్నారు. సభలో అనుచితంగా ప్రవర్తించి సభా గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకొనే అంశంపై లోతుగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. 

మరోవైపు, పార్లమెంట్‌లో సభాకార్యకలాపాలకు అడ్డుపడిన ఘటనలు గతంలో ఎప్పుడెప్పుడు జరిగాయో, అనుచిత ప్రవర్తనకు పాల్పడిన సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై అధ్యయనం చేయాలని ఇప్పటికే ఆయన అధికారుల్ని ఆదేశించినట్టు సమాచారం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగిన తీరుపై అధికార, విపక్షాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో మొత్తం పరిస్థితిని సమీక్షించేందుకు గురువారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో జరిగిన సమావేశంలో కూడా పార్లమెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని